ఏపీ సీఎం జగన్ .. తన సొంత జిల్లా కడపలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని నిర్ణ యించుకున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ.. పరిస్థితి ఒక అడుగు ముందు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా సీమ ప్రాంతంలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకోవాలని జగన్ భావించారు. ఈ క్రమంలో ఆయన అధికా రంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే జమ్మలమడుగులోని సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో పరిశ్రమ కోసం శంకు స్థాపన చేశారు.
ఈ స్టీల్ ఫ్యాక్టరీని రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. 3,275.66 ఎకరాలను కేటాయించారు. దీనికోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఒక ప్రత్యేక కంపెనీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టెండర్లను సైతం పిలిచారు.. ఏడు కంపెనీలు టెండర్లు వేశాయి. అయితే.. వీటిలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం బ్రిటన్ కు చెందిన లిబర్టీ స్టీల్స్‌ను భాగస్వామ్య కంపెనీగా ఎంచుకున్నారు.
ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంతో చర్చించిన తర్వాత ముడి ఇనుము సరఫరాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్ఎండీసీతో గతేడాది డిసెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుతం 4.8 మిలియన్ టన్నుల ముడి ఇనుము అవసరం కాగా.. ఎన్ఎండీసీ 5 మిలియన్ టన్నులు సరఫరా చేయనుంది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఆశించిన మేర సాయం లభించదని తేలిపోవడంతో ఏపీ సర్కార్ విదేశీ భాగస్వాములపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే బ్రిటన్‌కు చెందిన లిబర్టీ స్టీల్స్ లిమిటెడ్‌ను ఆశ్రయించింది. ఇందుకు అంగీకరించిన లిబర్టీ స్టీల్స్ ఈ ప్లాంట్‌లో మేజర్ షేర్ పెట్టేందుకు ఒప్పుకుంది. అయితే ఆ తర్వాత లిబర్టీ స్టీల్స్‌కు ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఆ ప్రభావం కడప స్టీల్ ప్లాంట్‌పై పడింది. బ్రిటన్‌లో లిబర్టీ స్టీల్స్‌కు మాతృసంస్ధ గుప్తా ఫ్యామిలీ గ్రూప్. ఈ సంస్ధకు ప్రధానంగా గ్రీన్ సిల్ క్యాపిటల్ రుణాలు ఇస్తోంది. ఇటీవల గ్రీన్ సిల్ క్యాపిటల్ దివాలా తీసింది.
అంతే కాదు తమ దివాలాకు తాము భారీగా రుణాలు ఇచ్చిన గుప్తా ఫ్యామిలీ గ్రూప్, అందులో భాగమైన లిబర్టీ స్టీల్స్ కారణమని వెల్లడించింది. అప్పటి నుంచి లిబర్టీ స్టీల్స్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. బ్రిటన్‌తో పాటు పలు దేశాల్లో ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్న లిబర్టీ స్టీల్స్ అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్దితుల నేపథ్యంలో ఉక్కు వ్యాపారంలో నష్టాల్ని చవిచూస్తోంది. దీంతో సహజంగానే ఆ ప్రభావం లిబర్టీ స్టీల్స్‌పై పడుతోంది. భారీ సంస్ధ కావడంతో అప్పులూ ఆ స్ధాయిలోనే పెరుగుతున్నాయి. తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న తమను ఆదుకోవాలంటూ బ్రిటన్ సర్కారుకు తాజాగా లిబర్టీ స్టీల్స్ అధినేత సంజీవ్ గుప్తా విజ్ఞప్తి చేశారు.
కానీ, బ్రిటన్ సర్కారు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై లిబర్టీ స్టీల్స్ దృష్టిసారిస్తోంది. అయితే ఈ అన్వేషణ ఆలస్యమయ్యే కొద్దీ అప్పుల ఊబిలోకి కూరుకుపోతుండటంతో ఏపీ ప్రభుత్వంలోనూ ఆందోళన పెరుగుతోంది. మొత్తానికి ఈ పరిస్థితితో కడప ఉక్కు పరిశ్రమకు ఆదిలోనే గండం ఏర్పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.