అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏమి చేసినా అడిగేదెవడురా నా ఇష్టం…మీ ఇళ్లలో గబ్బిళాలనే పెంచండి అంటా నా ఇష్టం…ఓ తెలుగు సినీకవి…ఓ మూర్ఘుడి పాత్రనుద్దేశించి రాసిన ఈ పాట చాలా పాపులర్. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ కు ఈ పాట అతికినట్టు సరిపోతుందని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో జగన్ పాలన అస్తవ్యస్థంగా మారిందని, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్నా వైసీపీ నేతలకు చీమ కుట్టినట్టు కూడా లేదు.
ఇక, కరోనా విషయంలో జగన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కరోనాకు ప్యారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో చెక్ పెట్టవచ్చంటూ జగన్ చేసిన కామెంట్స్ జాతీయ మీడియాలోనూ హైలైట్ అయ్యాయి. కరోనాపై జగన్ చేతులెత్తేశారని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఇక, జగన్ మాస్క్ పెట్టుకోకపోవడంపై చాలాకాలంగా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నా జగన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు మాస్క్ పెట్టడం లేదు.
ఈ నేపథ్యంలో ఏపీలో మాస్క్ పెట్టుకోకుంటే రూ.100 ఫైన్ కచ్చితంగా అమలు చేయాలంటూ జగన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఏకంగా ఆ ఆదేశాలిచ్చిన సమీక్షా సమావేశంలోనే జగన్ మాస్క్ లేకుండా పాల్గొనడం గమనార్హం. ఒక్క జగనే కాదు..మంత్రి బొత్సతోపాటు కొందరు జగన్ ను ఆదర్శంగా తీసుకొని మాస్కు లేకుండానే సమావేశానికి రావడం కొసమెరుపు.
జగన్ మాస్కు పెట్టుకోకుండా…జనాలను ఫైన్ వేస్తాననడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి పూట దేవుడితో మాట్లాడే జగన్ కు కరోనా అంటే అసలు భయం లేదని, అందుకే మాస్క్ పెట్టుకోరని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సీఎంకు ఒక రూలు! సామాన్యులకు మరో రూలా!’ అంటూ విమర్శిస్తున్నారు. ఏపీ ‘సీతయ్య’ జగన్ అని…హీ కెన్ మేక్ అండ్ బ్రేక్ ది రూల్స్ అని సెటైర్లు వేస్తున్నారు.
ఇప్పుడే కాదు గతంలోనూ చాలా సందర్భాల్లో జగన్ మాస్కు ధరించలేదని ఏకిపడేస్తున్నారు. మాస్కు నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలకు రెండు మూడు రోజులు మూసేయాలని జగన్ అంటున్నారని, అదే తరహాలో మాస్క్ పెట్టుకోకుండా సమావేశం నిర్వహించిన సీఎం కార్యాలయానికీ అవే నిబంధనలు వర్తిస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా….ఐ కెన్ మేక్ ద రూల్స్…బ్రేక్ ద రూల్స్ అనేది జగన్ సిద్ధాంతం అంటూ సెటైర్లు వేస్తున్నారు. మాస్కు లేని మహరాజు జగన్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.