నవ్యాంధ్రలో అన్నదాత ల పరిస్థితి దయనీయంగా మారింది. వరుస విపత్తులతో విలవిలలాడుతున్న రైతన్నకు పాలకులు అండగా నిలవడం లేదు. కరువు, తుఫానకు పంట నష్టపోయినవారికి ప్రభుత్వపరంగా ఓదార్పూ కరువైంది. నష్టపరిహారం ఊసే ఎత్తడం లేదు. భారీనష్టాలతో బావురుమంటున్న రైతులకు పంట రుణాల రీషెడ్యూలైనా చేయట్లేదు. గత నాలుగేళ్ల మాదిరిగానే 2023-24లోనూ విపత్తులు అన్నదాతను కుదేలు చేశాయి. పుడమి పులకరించేలా వర్షాలు కురవాల్సిన తొలకరి నుంచి ఖరీఫ్ సీజన ముగిసే వరకు చాలీచాలని వానలతో, మండుటెండలతో కొందరు రైతులు సాగుకు దూరమయ్యారు.
జలాశయాలు, కాలువల్ని నమ్ముకుని పంటలు వేసిన మరికొందరు రైతులు.. పంట కోత తరుణంలో తుఫాన దెబ్బకు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పంట నష్టపరిహారమైనా అందుతుందని ఆశిస్తున్న అన్నదాతలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా.. సర్కార్ నయాపైసా విదిలించలేదు. ఈ నేపథ్యంలో పాత బాకీలకు కొత్త అప్పులు తోడై, వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న రైతులు, కౌలు సాగుదారుల ఇళ్లలో పెద్ద పండుగ సంక్రాంతి వేళ సందడే కనిపించలేదు. ఆ తర్వాత కూడా సంతోషం కనిపించలేదు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చేయి పట్టుకుని నడిపిస్తామన్న జగన్.. ఎన్నికల హడావుడితో రాజకీయాల్లో బిజీ అయ్యారు.
రైతు కన్నీరు తుడిచేదెవరు?
గతంలో కరువు ఏర్పడితే.. కేంద్ర సాయం ఎక్కువగా పొందడానికి అవకాశం ఉన్న మేరకు కరువు మండలాలను ప్రకటించే పరిస్థితులుండేవి. ముఖ్యంగా చంద్రబాబు పాలనలో ఉమ్మడి రాష్ట్రంలోనైనా, నవాంధ్రలో అయినా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు- చంద్రబాబు కవల పిల్లలని ఎన్నో సార్లు హేళన చేసిన జగన.. తమ పాలనలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా, దండిగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండిపోతున్నాయని బీరాలు పలికారు. కానీ ప్రకృతి పరిహసించి, కరువు కబళించింది. ఎల్నీనో ప్రభావంతో నైరుతీ రుతుపవనాలు బలహీనపడి, ఖరీఫ్ సీజనలో తీవ్ర వర్షాభావం ఏర్పడింది.
రాష్ట్రవ్యాప్తంగా 27ు విస్తీర్ణంలో విత్తనమే నాటలేదు. అన్నదాతల ఆక్రందనలు, విపక్షాల ఆందోళనలతో.. కరువును కూడా అవహేళన చేసిన జగన్ సర్కారు దిగివచ్చి, 103 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. అయితే సాధారణం కన్నా అతి తక్కువ వర్షపాతం నమోదైన రాయలసీమలో చాలా మండలాలను కరువు జాబితాలో చేర్చకపోవడంపై రైతుల నుంచే నిరసనలు వ్యక్తమయ్యాయి. అక్టోబరులో ఖరీఫ్ సీజన ముగిసి, డిసెంబరులో మిచౌంగ్ తుఫాన సంభవించిన తర్వాత కేంద్రబృందం వర్షాభావ ప్రాంతాలను పరిశీలించింది. ఓ వైపు కరువు, మరోవైపు తుఫాన్లు సంభవిస్తే.. లక్షలాది ఎకరాల్లో, రూ.వేల కోట్ల విలువైన పంటలను రైతులు నష్టపోయారు. క్షేత్రస్థాయిలో కేంద్రబృందాల పర్యటన నివేదికలు జనవరి 10వ తేదీన వచ్చినా సాయం ఇంత వరకు రైతుల దరిజేరలేదు.
బటన నొక్కుడు కోసం ఎదురుచూపు
ఇదిగో ఇనపుట్ సబ్సిడీ, అదిగో పంటల బీమా అంటున్నా.. నెలలు తరబడి నిధులు విడుదల చేయట్లేదు. 2022-23 రబీ సీజనకు సంబంధించి పంటల బీమా పరిహారం కోసం, అలాగే 2021-22 రబీ, 2022ఖరీఫ్ సీజన్లలో రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకుని, వడ్డీతో సహా తిరిగి చెల్లించిన రైతులు వడ్డీ రాయితీ సొమ్ము కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 2022-23 రబీ పంటల బీమా పరిహారం లెక్కింపు జరుగుతోందని, 2023 అక్టోబరులో చెల్లింపులు జరుపుతామని జగన సర్కార్ అంతకు ముందే ప్రకటించింది. ఇక సున్నావడ్డీ రాయితీకి నవంబరులో బటన నొక్కుతామని చెప్పి, నెలలు గడిచినా.. ఆ ఊసెత్తడం లేదు. ఏ సీజనలో పంట దెబ్బతింటే అదే సీజనలో రైతుల్ని ఆదుకుంటామని జగన్ ప్రగల్భాలు పలికారు.
డిసెంబరులో సంభవించిన తుఫాన నష్టంపై తుది నివేదికలు అందినా, రబీ సీజన ముగింపు దశకు వచ్చినా.. ఇనపుట్ సబ్సిడీ పంపిణీపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. తుఫాన సహాయ చర్యలకు కేంద్రం నిధులిచ్చినా.. రైతుకు మాత్రం సాయం అందించలేదు. వీటన్నింటి బటన నొక్కుడు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రభుత్వం ఈ నిధులు ఇస్తుందా అని వారిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.