ఏపీలో సీఎం జగన్ ప్రజలపై రకరకాల పన్నులు విధిస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచిన జగన్….ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చార్జీలు…ఆఖరికి చెత్తపై కూడా పన్ను విధించారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అయితే, ఇన్ని పన్నులు విధించి…జనం దగ్గర ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న జగన్ మాత్రం తన సొంత ఇంటికి పన్ను కట్టడం మరచిపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లి మునిసిపాలిటీకి జగన్…అక్షరాలా రూ.16లక్షలకు పైగా బాకీ పడ్డారు. ఇదేదో విపక్షాలు ప్రచారం చేస్తున్న గాలివార్త అనుకుంటే పొరపాటే. సాక్ష్యాత్తూ మునిసిపల్ శాఖ అధికారిక వెబ్సైట్లో ఈ విషయం వెల్లడించారు. ఏదో ఒక నెలో, రెండు నెల్లో పన్ను కట్టడం మరచిపోయారనుకుంటే పోనీలే అనుకోవచ్చు. కానీ, గత రెండేళ్లుగా జగన్ తన ఇంటి పన్ను చెల్లించకపోవడం శోచనీయం. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇంటికి కానీ, కార్యాలయానికి కానీ ఆస్తి పన్ను చెల్లించడంలేదు.
మునిసిపల్‌శాఖ వెబ్సైట్ ప్రకారం జగన్ కార్యాలయంపై రూ.13,25,940 పన్ను బాకీ ఉంది. ఇక, ఇంటికి సంబంధించి రూ.59,256 పన్ను బకాయి ఉంది. మొత్తంగా రూ.13,85,196 పన్ను బాకీ పడ్డారు. రెండేళ్లుగా పన్ను కట్టనందుకు జరిమానా రూ.2,82,103 కలుపుకుంటే మొత్తం రూ.16,67,299 బాకీ పడ్డారు. అయితే, జగన్ ప్రభుత్వ భవనంలో నివసిస్తుంటే… దాని ఆస్తిపన్ను, ఇతర పన్నులు కూడా ప్రభుత్వమే చెల్లించేది.
కానీ… జగన్ ఇల్లు, సీఎం క్యాంపు ఆఫీసు…ఉన్న భవనాలు ఆయన సతీమణి భారతీ రెడ్డి పేరు మీద ఉన్నాయి. రూల్స్ ప్రకారం ప్రైవేటు నివాసాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఉంటే సంబంధిత భవన యజమానే స్థానిక పన్నులు భరించాలి. ఈ నిబంధన ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు, ఇల్లుకు పన్ను భారతీ రెడ్డి చెల్లించాలి. సామాన్యులు ఇంటి పన్ను కట్టకుంటే నోటీసులు పంపి నానా యాగీ చేసే అధికారులు… ఇప్పటిదాకా భారతీ రెడ్డికి కనీసం నోటీసులు జారీ చేయకపోవడం కొసమెరుపు.