‘వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం రాగానే మెగా డీఎస్సీ వేస్తాం’…అంటూ నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం జగన్ వైసీపీ ఫ్యాన్ గుర్తు సాక్షిగా గాలివాటం హామీలిచ్చారు. కట్ చేస్తే, జగన్ సీఎం అయిన తర్వాత డీఎస్సీ మాట దేవుడెరుగు…తాజాగా టీచర్ పోస్టుల రేషనలైజేషన్ కు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, వేల సంఖ్యలో ఉన్న టీచర్ల ఖాళీ పోస్టులు మాయం అయ్యాయి. దాదాపు 18వేల టీచర్ పోస్టులకు జగన్ మంగళం పాడడంతో డీఎస్సీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఉసూరు మంటున్నారు.
కొత్తగా నియామకాల అవసరం లేకుండా రేషనలైజేషన్ విధానాన్ని విద్యాశాఖ రూపొందించడంతో ఇకపై 9, 10 తరగతుల్లో మాత్రమే. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను అమలు చేయనున్నారు. 1-8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉంటుంది. ఆ తరగతులకు తెలుగు మాధ్యమం కూడా ఉంటే ఉపాధ్యా యుల సంఖ్య పెంచాల్సి వస్తుందనే కారణంతో ఆంగ్ల మాధ్యమం అంటూ కొత్త విధానం తీసుకొచ్చారు.
చంద్రబాబు హయాంలో రెండు డీఎస్సీలు వేసి వేల పోస్టులిచ్చారు. కానీ, జగన్ మాత్రం రిక్త హస్తాలు చూపించారు. ఇక, చంద్రబాబు హయాంలో ప్రాథమిక బడుల్లో ఒక టీచరుకు 20 మంది విద్యార్థులు అనే నిబంధన ఉండేది. దానిని జగన్ 1:30గా మార్చారు. దీంతో, ఎస్జీటీ పోస్టులు భారీగా మిగిలాయి. వీరిలో అర్హతున్న వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చి, సబ్జెక్టు ఉపాధ్యాయుల ఖాళీలను సర్దుబాటు చేస్తారు.
ఇప్పటికే ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న 3,260 మంది ఉపాధ్యా యులను సర్వీసు నిబంధనల్లోకి తేవడానికి 4,764 ఎస్జీటీ పోస్టు లను రద్దు చేశారు ఉన్నత పాఠశాలల్లో 1,716 సబ్జెక్టు ఉపాధ్యా యుల కొరత ఉంది. ఇవి కాకుండా గతంలో బదిలీల సమయంలో 15 వేల పోస్టులను బ్లాక్ చేశారు. ఉద్యోగ విరమణులు, మరణాలతో మరో 1000కి పైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. మొత్తం సుమారు 18 వేల వరకు ఖాళీలున్న కొత్త డీఎస్సీ వేయకుండా సర్దుబాటు చేస్తున్నారు.
దీంతో, ఈ రేషనలైజేషన్ ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమతో కనీసం చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని, ఇది ప్రభుత్వ పాఠశాలలకు గొడ్డలిపెట్టుగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే, సీపీఎస్ రద్దు విషయంలో జగన్ సర్కార్ పై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులకు తాజా నిర్ణయం పుండుమీద కారం చల్లినట్లయింది.