సమయం లేదు మిత్రమా అని బాలయ్య అప్పుడెప్పుడో డైలాగులు చెప్పారు. ఇప్పుడీ మాట జగన్ కూడా అంటున్నారు. అంతేకాదు జిల్లాలలో పార్టీ స్థితిగతులపై ఆరా తీసే సమయంలో చాలా అసహనం వ్యక్తం చేశారని కూడా తెలుస్తోంది. తాడేపల్లిలో నిన్నటి వేళ ప్రాంతీయ సమన్వయకర్తలు, వివిధ జిల్లాల అధ్యక్షులతో ఓ రివ్యూ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీ మీ జిల్లాలలో ఏం జరుగుతుందో మీకేమయినా తెలుస్తుందా అని అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
నిధులు ఇచ్చినా సంబంధిత పనులు గుర్తించక ఆలస్యం చేస్తే ఒప్పుకునేదే లేదని కూడా జగన్ స్పష్టం చేశారు. ఎందుకని మనకు 175 / 175 రావు అని పదే పదే అన్నారు. ఏ విధంగా చూసినా పార్టీలో ప్రక్షాళన తప్పేలా లేదని ప్రభుత్వ పెద్ద, మాజీ జర్నలిస్టు సజ్జల రామకృష్ణా రెడ్డి మాటల ప్రకారం అర్థం అవుతోంది.
ఎన్నికలకు రెండేళ్ల కాల వ్యవధి మాత్రమే ఉండడంతో నిధుల మంజూరు., అభివృద్ధి పనులను వేగవంతం చేసే తీరు తదితర విషయాలపై ఆయన దిశానిర్దేశం చేశారు అని ప్రధానంగా తెలుస్తోంది. కొన్ని సర్వే రిపోర్ట్ల ప్రకారమే ఆయన పూర్తిగా ఆధారపడి మాట్లాడి, కొన్ని సూచనలు చేసి పంపారు అని తెలుస్తోంది. పార్టీ ఏ పని అప్పగించినా కూడా శ్రద్ధాసక్తులతో చేయడం మీ విధి అని మరోసారి గుర్తు చేస్తూ, సొంత మనుషులపై కూడా సీరియస్ అయ్యారని సమాచారం.
తప్పని సరిగా ప్రాంతీయ సమన్వయకర్తలంతా నెలలో పది రోజులు తమ పరిధిలో పర్యటించాలని, సాకులు చెబితే కుదరదని తేల్చేశారు. కొత్త ముఖాల వేట మాత్రం తప్పదని తేల్చేశారు. మీకు ఇచ్చిన బాధ్యతలు కష్టం అయితే చెప్పండి మార్చేస్తాను అని అన్నారు. ఇది కూడా పార్టీలో చర్చకు తావిస్తోంది . చాలా చోట్ల మాజీ డిప్యూటీ సీఎంలపైనే ఆరోపణలు వస్తున్నాయి కనుక వారిని ఉద్దేశించి పదే పదే కొన్ని సూచనలు చేశారు.
మాజీ మంత్రులను కూడా మరోసారి హెచ్చరించి పంపారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత (గుంటూరు జిల్లా అధ్యక్షురాలు ) గత కొద్ది కాలంగా యాక్టివ్ గా లేరు. అదేవిధంగా సొంత మామ బాలినేని శ్రీనివాస్ రెడ్డి (మంత్రి పదవి తప్పించి రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించారు) పై కూడా అసహనం వ్యక్తం చేశారని ప్రధాన మీడియా చెబుతోంది. ఈ ఇద్దరి పనితీరు అస్సలు బాలేదని, తాను చెప్పిన విధంగా నడుచుకోవడం లేదని, గడప గడపకూ ప్రొగ్రాంను మానిటరింగ్ చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సర్వేల ఫలితాలు అస్సలు ఆశాజనకంగా లేవని తేలిపోయినందునే ఆకస్మికంగా ఈ భేటీ ఏర్పాటు చేశారని కూడా తెలుస్తోంది.
Comments 1