సాధారణంగా పార్టీ అధినేతతో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి కార్యకర్తలకు నేతలకు సంబంధాలు ఉండటం చాలా అరుదు. అయితే, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు మాత్రం ఏ పార్టీ అధినేతతో అయినా టచ్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, వైసీపీ అధినేత జగన్ తీరు మాత్రం ఇందుకు భిన్నం. గతంలో కనీసం ఎమ్మెల్యేలతో కూడా టచ్ లో ఉండని జగన్…వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ దెబ్బకు కాస్త దిగి వచ్చారు.
ఈ క్రమంలోనే అడపాదడపా ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్న జగన్ ఆ తర్వాత అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలతో భేటీలకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేతోపాటు 50మంది కీలక నేతలతో సమీక్ష నిర్వహించాలని జగన్ ప్లాన్ చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఇలాకా కుప్పం నుంచే ఈ సమీక్షలకు జగన్ శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత రాజాం నియోజకవర్గంలోనూ జగన్ సమీక్ష నిర్వహించారు.
అయితే ఇదంతా నెల క్రితం వ్యవహారం. నెలకు రెండు నియోజకవర్గాలే కవర్ కావడంతో జగన్ ఈ నియోజకవర్గాల సమీక్షలపై పునరాలోచనలో పడ్డారట. ప్రస్తుతం జగన్ ఉన్న బిజీ షెడ్యూల్లో ఇలా వీటిని నిర్వహించడం సాధ్యం కాదేమోనన్న అంచనాకు వచ్చేశారట. ఇంకా 148 నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించాల్సి ఉంది. అంటే ఎడతెరిపి లేకుండా రోజుకో సమీక్ష నిర్వహించినా దాదాపు ఆరు నెలలు పడుతుంది.
పోనీ గ్యాప్ తీసుకొని సమీక్షలు అంది కనీసం ఏడాది పడుతుంది. అంతేకాదు ఈ భేటీలకు వచ్చిన 50 మంది నియోజకవర్గంలోని సమస్యలపై జగన్ దగ్గర మొరపెట్టుకుంటున్నారట. పార్టీలో ఆధిపత్యం, నేతల మధ్య కోల్డ్ వార్ వంటి వ్యవహారాలు, పంచాయతీలు జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. అదీగాక, నియోజకవర్గానికి 50 మందిని ఎంపిక చేయడంతో కొందరు కీలక నేతలు ఫీలవుతున్నారట.
కనీసం ఇటువంటి సమావేశాలకు కూడా తమకు ప్రాధాన్యత దక్కడం లేదని గ్రామానికి ఒక నేతను కూడా జగన్ పిలవడం లేదని వారు వాపోతున్నారట. మరి, ఈ బాలారిష్టాలను అధిగమించి జగన్ సమీక్షలు కొనసాగిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.