కాపు నేస్తం పేరిట ఇవాళ ముఖ్యమంత్రి సంబంధిత లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. ఇదే సందర్భంలో ఆయన కొన్ని మాటలు కూడా చెప్పనున్నారు. బాగుంది అంతా బాగుంది కానీ కార్పొరేషన్ల మాటేంటి ? ఆయన కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ వాటికి నిధులన్నవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు అన్న విమర్శ ఒకటి నడుస్తోంది. దీనిపై జగన్ ఏమంటారో ? ముఖ్యంగా కాపు నేస్తం ద్వారా ఆయన 500 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేయనున్నారు. బాగుంది..ఇదే సమయంలో కార్పొరేషన్ ను ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు అన్న విమర్శలూ ఉన్నాయి.
అసలు కార్పొరేషన్ చైర్మన్లు ఉండి ఏం లాభం.. వాళ్లేం చేస్తున్నారని ? హాయిగా రియల్ ఎస్టేట్ బిజినెస్సులు చేసుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇటువంటి చైర్మన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వారు కేవలం అలంకార ప్రాయమయిన పదవుల్లో తప్ప వారికేం అధికారాలూ లేవు. అధికారాలే లేని పదవులు ఎందుకు అన్న ప్రశ్న కూడా ఇ దే సందర్భాన వినిపిస్తోంది.
శ్రీకాకుళం జిల్లా వరకూ రెండు కాపు సామాజిక నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి పాతపట్నం, రెండు ఎచ్చెర్ల.ఈ రెండు నియోజకవర్గాలలో అభివృద్ధి ఏం లేదు అన్నది వాస్తవం. పాతపట్నం వరకూ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మొన్ననే యాక్టివ్ అయ్యారు. గతంలో ఆమె నియోజకవర్గంలో పెద్దగా తిరుగాడే వారే కాదు. పోనీ గొర్లె కిరణ్ (ఎచ్చెర్ల నియోజకవర్గం).. కూడా యాక్టివ్ గా ఉంటున్నారా అంటే అదీ లేదు.. అన్న ఆరోపణలే ఉన్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నడుపుకుంటూ ఉంటే ప్రజలు ఇచ్చిన అధికారానికి విలువేంటి అన్నది ఆయన విషయంలోనూ వినిపిస్తున్న ఆరోపణ. ఇవన్నీ చూస్తే మరి రెండు నియోజకవర్గాలు ఎటువంటి సామాజిక పురోగతి లేకుండా ఉండిపోతున్నాయి అన్నది నిర్వివాదాంశం.
ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న కాపు ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో ప్రతినిధులు కనీసం వారి సొంత మనుషుల కోసం అయినా చేసిన సాయం ఏంటి ?లేదా వారి సొంత మనుషుల పురోగతికి అయినా పాటు పడిన విధానం ఏంటి అన్నది ఓ ప్రశ్న వినిపిస్తున్నది సామాజికవేత్తల నుంచి ! అయినా కులాల పేరిట కార్పొరేషన్లు ఏర్పాటు చేసినంత మాత్రాన ఫలితాలు రావు అని , వాటికి అధికారాలు, నిధులు అదేవిధంగా సంబంధిత కార్యాలయలకు విధి విధానాలు కేటాయిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు సామాజిక వేత్తలు.
కార్పొరేషన్ల ఏర్పాటు కారణంగా జరిగిన మేలు ఏం లేదన్నది కూడా వారి అభిప్రాయం. ఆర్ధికంగా ఏడాదికి పదిహేను వేలు ఇచ్చే కన్నా వారి పేరిట కొన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వమే ముందుకు వచ్చి సంబంధిత చర్యలు వేగవంతం చేస్తే ఎంతో మేలు అన్నది మరో అభిప్రాయం సుస్పష్టంగా సామాజిక వేత్తల నుంచి వినవస్తోంది. కేవలం ఎన్నికలలో గెలుపు కోసమే ఇటువంటి పథకాలు అమలు చేసిన దాఖలాలు గతంలోనూ ఉన్నా కూడా అవేవీ సానుకూల ఫలితాలు ఇవ్వలేదని తేలిపోయిందని కూడా అంటున్నారు.