సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, తమ హయాంలోనే పోలవరం పూర్తి చేస్తామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. కానీ, వైసీపీ నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండడం లేదన్నది ప్రతిపక్ష నేతల ఆరోపణ. పోలవరం ప్రాజెక్టును జగన్ నిర్లక్ష్యం చేశారని, కేంద్రానికి భయపడి పోలవరం నిధులను సాధించలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
ప్రాజెక్టులకు జగన్ కనీసం గ్రీజు కూడా పెట్టలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి మొదలు వెలుగొండ వరకు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని నిప్పులు చెరిగారు. కోస్తాంధ్ర ప్రాజెక్టులపై టీడీపీ హయాంలో రూ.21,442 కోట్లు ఖర్చు చేశామని, వైసీపీ మాత్రం రూ.4,375 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పరిస్థితిపై తాను ప్రెస్‌మీట్ లు పెట్టి వాయిస్తున్నానని, అది చూసి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి హడావిడిగా సమీక్షలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
తన హయాంలో 64 ప్రాజెక్టులు మొదలుబెట్టి 23 పూర్తి చేశానని, 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించామని గుర్తు చేశారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించని జగన్ వాటి నిర్మాణాలు ఎలా పూర్తిచేస్తారని ప్రశ్నించారు. ఏపీలోని 69 నదుల అనుసంధానం పూర్తయితే నీటి సమస్య ఉండదని అన్నారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేయవచ్చన్నారు. ఆ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కోస్తా జిల్లాలో పడకేసిన ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.