గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తి దాడి వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ కోడికత్తి డ్రామాను వైసీపీ నేతలే పీకే సాయంతో రక్తి కట్టించారని ఆరోపణలు వచ్చాయి. జగన్ పై దాడి చేసిన శ్రీను వైసీపీ కార్యకర్త అని, ఆ దాడి వైసీపీనే చేయించిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఆ తర్వాత ఆ ఘటన సింపతీ కొట్టేసిన జగన్…సీఎం అయ్యారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ వ్యవహారం తాజాగా చర్చనీయాంశమైంది.
ఆ బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఎన్ఐఏ కోర్టు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని కోర్టు కరాఖండిగా కొద్ది రోజుల క్రితం తేల్చి చెప్పేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న జగన్ ను ఇంతవరకు ఎందుకు విచారణ జరపలేదని నిందితుడి తరఫున న్యాయవాది ప్రశ్నించారు. జగన్ స్టేట్ మెంట్ రికార్డు చేశామని కోర్టుకు ఎన్ఐఏ తరఫు న్యాయవాది తెలిపారు.
కానీ, ఆ స్టేట్ మెంట్ రికార్డు విషయం చార్జిషీట్ లో ఎందుకు ప్రస్తావించలేదని కోర్టు ప్రశ్నించింది. బాధితుడిని విచారణ జరపకుండా మిగతా సాక్షులను విచారణ జరిపి ఉపయోగం ఏంటని కోర్టు ప్రశ్నించింది. బాధితుడు జగన్ సహా మిగతా వారంతా తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఈ ఏడాది జనవరిలో ఆదేశించింది. కానీ, జగన్ కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఎన్ఐఏ కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏప్రిల్ 10వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సీఎం జగన్ ను ఎన్ ఐఏ కోర్టు ఆదేశించింది. అంతేకాదు, జగన్ తో పాటు ఆయన పీఏ నాగేశ్వరరెడ్డి కూడా విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఎయిర్ పోర్టు అథారిటీ కమాండర్ దినేశ్ ను న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసులు కోడికత్తిని, మరో చిన్న కత్తిని కోర్టుకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన ఓ సెల్ ఫోన్, పర్సును కూడా ఎన్ఐఏ ధర్మాసనానికి అందించారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.