తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ మరో ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. సీనియర్ పొలిటిషియన్ అయిన పనబాక లక్ష్మిని పార్లమెంటుకు పంపాలని, జగన్ అవినీతిని ఎండగట్టి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
ఇక, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి స్థానాన్ని గెలుచుకొని ఏపీలో పట్టు పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని టార్గెట్ చేసిన బీజేపీ నేతలు…గురుమూర్తి మతం వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం తలుపు తట్టేందుకు రెడీ అయ్యారు. అవసరమైతే ఆ విషయంపై కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని బీజేపీ నేత సునీల్ దేవధర్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై బీజేపీ-జనసేన అభ్యర్థి రత్నప్రభ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించినందుకుగాను దేశ ప్రజలకు దేశ ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను అవమానించేలా సాక్షి దినపత్రికలో వేసిన ఓ కార్టూన్ పై రత్నప్రభ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ కార్టూన్ వేసిన పేపర్ కటింగ్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన రత్నప్రభ….ఈ చర్యను పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది దేశ ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీతో పాటు, బీజేపీ నేత సునీల్ దేవధర్, జనసేన పార్టీ, బీజేపీ ట్విట్టర్ ఖాతాలను ఆమె ట్యాగ్ చేశారు. మరి, ఈ వ్యవహారంపై జగన్, వైసీపీ నేతల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.