ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. జనంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్‌కు 2019 ఎన్నికల్లో జనాలు జై కొట్టారు. ఆయనను గెలిపించారు. అధికారాన్ని కూడా అప్పగించారు. దీనికి కారణం.. తమకు ఇంకా ఏదో మేలు చేస్తారని.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తారని.. పోలవరం వంటి కీలక ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తార ని అనుకున్నారు. అయితే.. ఇవేవీ సాకారం కాలేదు. కానీ, ఐదేళ్లు మాత్రం గిర్రున తిరిగిపోయాయి.
ఇప్పుడు మిగిలింది.. మరో ఛాన్స్! కానీ, ఇది సాధ్యమేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. సీఎంగా జగన్ గురించి ఏ నలుగురు మాట్లాడుకున్నా.. మిగిలేది.. బటన్ నొక్కుడు ముఖ్యమంత్రి అనే పేరు మాత్రమే! ఇంతకు మించి చెప్పుకొనేందుకు.. జగన్ ఇది చేశాడు.. అది తెచ్చాడు.. అని సమర్థించు కునేందుకు ఏమీ లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది.
పైగా.. రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గత ఐదేళ్ల కిందట ఎలాంటి సమస్యలు ఉన్నాయో.. అవి అలానే ఉన్నాయి. ఇక, మరోవైపు ఉద్యోగులు రగిలిపోతున్నారు. తమకు కనీసం వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదని.. ఎన్నికలకు ముందు.. ఇచ్చిన.. సీపీఎస్ రద్దు హామీని బుట్టదాఖలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఖచ్చితంగా జగన్‌కు వ్యతిరేకంగా వస్తుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు.. నిరుద్యోగులు కూడా ఎలాంటి సానుకూలత చూపించడం లేదు. పైగా అప్పులు చేస్తున్నారన్న మెజారిటీ వర్గాల వాదన.. ఒక్క ఛాన్స్‌ను మరో చాన్స్ దిశగా ఆలోచించకుండా చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇక, తెలంగాణలో అప్పటి అధికార పార్టీ బీఆర్ ఎస్ ఎన్నికలకుముందు కేంద్రంలోని బీజేపీతో రాజీ పడిందన్న వాదన ఎలా ఉందో.. ఇప్పుడు ఏపీలోనూ జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీ పడిందని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. దీంతో ఒక్క ఛాన్స్‌తో జగన్ ఏంటో తేలిపోయిందని.. అంటున్నవారే కనిపిస్తున్నారు. మరి మరోఛాన్స్ ఇస్తారా? అనేదిసందేహంగానేఉంది.