2014-19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ప్రతిపక్ష వైసీపీ, జగన్ చేసిన దాడి అలాంటిలాంటిది కాదు. ఐప్యాక్ సహకారంతో ఎన్నో విషయాల్లో బాబు సర్కారును అన్‌పాపులర్ చేసి.. జనాల్లో తీవ్ర వ్యతిరేకత తీసుకురావడంలో వైసీపీ విజయవంతం అయింది. ఐతే ప్రత్యేక హోదా లాంటి విషయాల్లో బాబు ప్రభుత్వ తీరును ఎండగట్టి జనాల్లో ఆశలు రేకెత్తించిన జగన్ అండ్ కో.. అధికారంలోకి వచ్చాక ఎంత సింపుల్‌గా ఆ విషయాన్ని పక్కన పెట్టేసిందో తెలిసిందే.
ఇలా ఎన్నో అంశాల్లో జగన్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి జనాలకు స్పష్టంగా అర్థం అయిపోతోంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో ఖరీదైన హిమాలయ వాటర్ వాడటం గురించి నానా రచ్చ చేసి.. జగన్ అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ రేటున్న నీళ్ల బాటిళ్లు వాడటం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. అలాగే బాబు ముఖ్యమంత్రిగా విమాన ప్రయాణాల ఖర్చు గురించి కూడా వైసీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
కట్ చేస్తే ఇప్పుడు జగన్ ఏదైనా పర్యటన అంటే నేల మీద అడుగు పెట్టడమే గగనం అయిపోయింది. 50 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్లే వాడుతున్నారు. ఈ సోమవారం నాడు జగన్ పర్యటన వివరాలు చూస్తే మరింత ఆశ్చర్యం కలగడం ఖాయం. ఆ రోజు ఆయన గుంటూరు జిల్లాలో పర్యటించబోతున్నారు.
ఈ సందర్భంగా కేవలం 9 కిలోమీటర్లు దూరం.. పది నిమిషాల పాటు రోడ్డు మీద ప్రయాణించడానికి కూడా జగన్ సిద్ధంగా లేని విషయం వెల్లడైంది. ఆ కొంత దూరానికి కూడా హెలికాఫ్టరే వాడబోతున్నట్లు పర్యటన వివరాలపై అధికారికంగా ఇచ్చిన ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ఈ పర్యటన మొత్తం హెలికాఫ్టరే వాడుతున్నట్లయితే.. మధ్యలో కార్లలోకి మారడం ఇబ్బంది అనుకోవడానికి కూడా లేదు.
తాడేపల్లి నుంచి ఆయన కార్లోనే బయల్దేరబోతున్నారు. మధ్యలో హెలికాఫ్టర్ ఎక్కి ఒకచోటికి ప్రయాణిస్తారు. కొన్ని కార్యక్రమాల తర్వాత మళ్లీ మళ్లీ హెలికాఫ్టర్ ఎక్కుతారు. తర్వాత కార్లో ప్రయాణిస్తారు. 20 కిలోమీటర్ల దూరం కవర్ చేయడానికి ఐదేసి నిమిషాల పాటు రెండుసార్లు ఆయన హెలికాఫ్టర్ వాడబోతున్నారు. దీనికి అయ్యే ఖర్చు రూ.12 కోట్లు కావడం గమనార్హం. గతంలో చంద్రబాబు విదేశీ పర్యటనల కోసం విమానాలు వాడటం గురించి అంత గగ్గోలు పెట్టిన జగన్.. ఇప్పుడు అసలు అవసరమే లేని పరిస్థితుల్లో హెలికాఫ్టర్ వాడి ప్రజాధనాన్ని ఈ స్థాయిలో దుర్వినియోగం చేయడం ఏమిటని జనాలు ప్రశ్నిస్తున్నారు.