ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏదో ఒక విధంగా ప్రజలను మచ్చిక చేసుకుందామని భావించిన వైసీపీ తుఫాను రూపంలో పెను విపత్తు ముంచుకొచ్చింది. తాజాగా మిచౌంగ్ తుఫాను ఏపీని అతలాకుతలం చేస్తోంది. నెల్లూరు, ఉభయ గోదావరి, బాపట్ల, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా తదితర తీర ప్రాంత జిల్లాలు అల్లాడుతున్నాయి.
ఆయా జిల్లాల్లో కల్వర్టులు కొట్టుకుపోయాయి. రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాష్ట్రస్థాయి రహదారులు కూడా నామరూపాలు లేకుండా పోయాయి. అసలే వైసీపీ సర్కారులో రోడ్లను నిర్మించడం లేదని, మోకాల్లోతు గుంతలతో ఇబ్బందులు పడుతున్నామని.. ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వచ్చిన తుఫానుతో మరింతగా రహదారులు దెబ్బతిన్నాయి. ఇది వైసీపీకి మరింత ఇరకాటంగా మారింది.
మరోవైపు లోతట్లు ప్రాంతాల్లోని సుమారు 25 వేల కుటుంబాలకు పైగానే రోడ్డున పడ్డాయి. దీంతో వారిని ఆదుకునేందుకు జిల్లాకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవి ఏమూలకూ చాలవని.. కనీసం పది కోట్లయినా.. ఇవ్వాలని కలెక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక, పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. నిన్న మొన్నటి వరకు సామాజిక సాధికార బస్సు యాత్రలతో బిజీగా ఉన్న నాయకులు ఇప్పుడు వాటిని ఆపేశారు.
ఇక, ఇప్పుడు తుఫాను తగ్గాక మొదలు పెట్టాలన్నా.. కూడా అనేక సమస్యలకు వారు సమాదానం చెప్పాల్సి ఉంటుంది. సో.. ఎలా చూసుకున్నా.. ఎన్నికల ముంగిట తుఫాన్ దెబ్బతో వైసీపీకి ఊపిరి సలపడం లేదు. మరోవైపు ప్రతిపక్షాలు.. ఇదేసమయంలో విజృంభించి.. సర్కారును మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుందోచూడాలి.