ట్రాక్ తప్పడం అంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి కొందరు ప్రేరేపించిన పరిస్థితిలోకి జారు కోవడం. అది.. 2017వ సంవత్సరం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ విజృంభించి మాట్లాడుతున్నారు. గోదావరి పుష్కరాల మృతుల గురించి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి గంభీరమైన గొంతు ఒకటి… “తమ్ముడు.. తమ్ముడు.. ఇది మన నెంబరే కదా!“ అంటూ..జగన్‌ను ఉద్దేశించి పిలుస్తోంది.
ఎవరా? అంటూ.. సభలో ఉన్నవారంతా.. ఆ పిలిచిన నాయకుడివైపు తిరిగి చూశారు. కానీ, జగన్ మాత్రం కనీసం తొణకలేదు.. బెణకలేదు. అంటే.. జగన్ జైల్లో ఉన్నప్పుడు.. ఖైదీ నెంబర్‌ను చూపిస్తూ.. సభలో గేలిచేయాలని అనుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి జగనే షాకిచ్చారు. ఇక, ఎన్నికలకు ముందు కూడా .. జగన్ ఆస్తులు, కేసులపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. అనేక మీడియా సంస్థలు పుంఖాను పుంఖాలుగా రాసుకొచ్చాయి. అయినా..జగన్ స్పందించలేదు.
ఇక, 2018లో పాదయాత్ర చేస్తున్నప్పుడు.. “ఇది మార్నింగ్ వాక్- ఈవినింగ్ వాక్- కాదు, క్యాట్ వాక్“ అంటూ.. అప్పటి మంత్రులు దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు వంటివారు గేలిచేశారు. వీటిని కొన్ని సంస్థలు పదే పదే ప్రచారం చేశాయి. అయినా.. తన ఏకాగ్ర చిత్తం నుంచి జగన్ ఎప్పుడూ తొలగిపోలేదు. కనీసం పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు. కానీ, తాజాగా షర్మిల ఎఫెక్ట్‌తో ఆయన చలించిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. గత నాలుగు రోజులుగా జగన్ పెట్టుకున్న షెడ్యూల్ వేరు. కానీ, ఆయన చేస్తున్నది వేరు.
దీంతో జగన్ మనసు చలించిపోయిందన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి… గుంటూరు బాధితురాలి కు టుంబాన్ని కలిసిన జగన్.. ఆవెంటనే కడపలో పర్యటించి.. ఇటీవల అన్నమయ్య జిల్లాలో సంభవించిన వరద బాధితులను పరామర్శించాలని నిర్ణయించారు. కానీ, వెళ్లలేదు. అదేవిధంగా పార్టీ నాయకులతో భేటీ అవ్వాలని ముందే షెడ్యూల్ ప్రకటించారు. కానీ, అది కూడా సాగలేదు. దీనికి కారణం.. షర్మిల చేసిన ఆరోపణలు.. తదనంతర పరిణామాలేనని అంటున్నారు పరిశీలకులు.