డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై రాజకీయ ప్రకంపనలు రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జగన్ కు వైఎస్ షర్మిల కూడా వ్యతిరేకంగానే ఉన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రికి సంబంధించిన విషయం కావడంతో షర్మిల రియాక్షన్ కు కూడా ప్రాధాన్యత ఏర్పడింది. ఆ పేరు మార్పు నిర్ణయం సరికాదని షర్మిల తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి షర్మిల ఆ వ్యవహారంపై స్పందించారు.
ఒకరి ఖ్యాతి వైఎస్ఆర్కు అవసరం లేదని షర్మిల చెప్పారు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును..మరో ప్రభుత్వం తొలగిస్తే అది వారిని అవమాన పరిచినట్లేనని అన్నారు. తన తండ్రిని కుమార్తెగా తాను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదని, తన తండ్రిని తాను ఆరాదించినట్లుగా ఎవరూ ఆరాధించి ఉండరని షర్మిల ప్రకటించారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లేనని చెప్పారు.
ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారని, మరో ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించినట్లేనని షర్మిల లాజికల్ గా ప్రశ్నించారు. ఒకరి ఖ్యాతిని వైఎస్సార్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదని…, వైెఎస్సార్ కు ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేదని షర్మిల అభిప్రాయపడ్డారు. వైెస్సార్ చనిపోతే ఆ భాధ తట్టుకోలేక 700 వందల మంది చనిపోయారని, అలాంటి ఖ్యాతి ఉన్న వైఎస్సార్ కి ఇంకొకరి ఖ్యాతి అవసరం లేదని స్పష్టం చేశారు.
కొంత కాలంగా జగన్కు, షర్మిలకు మధ్య సత్సంబంధాలు లేవన్న ప్రచారం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన తండ్రి పేరు విషయంలో జగన్ నిర్ణయాన్ని షర్మిల తీవ్రంగా ఖండించడం చర్చనీయాంశమైంది. నిజం చెప్పాలంటే టీడీపీ నేతలకు షర్మిల కామెంట్లు కొండంత బలాన్నిచ్చాయి. అయితే, షర్మిల ప్రకటనపై వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.