జరిగే మాటను చెప్పకుండా ఉండటం రాజకీయంలో కనిపించే మొదటి లక్షణం. మేం ఫలానా వారిపై చర్యలు తీసుకుంటామని.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పార్టీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వాల్ని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటే సమ్ థింగ్ రాంగ్ అన్న మాట వినిపిస్తోంది. తాజాగా బెజవాడలో నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభకు హాజరైన కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలిస్తే.. ఒక విషయం ఇట్టే అర్థమవుతుంది. బెయిల్ మీద ఉన్న నేతలు కచ్ఛితంగా జైలుకు వెళతారన్న వ్యాఖ్యలు చేశారు.
నిజంగానే బెయిల్ మీద ఉన్ననేతల్ని జైలుకు పంపే ఆలోచనే ఉంటే.. అసలు ఆ అంశం మీద మాట్లాడటం ఉండదని చెబుతున్నారు. ప్రతి విషయం పొలిటికల్ గా టర్న్ తీసుకుంటున్న ఇప్పటి పరిస్థితుల్లో ప్రజాకర్షణ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి సూటిగా కాకున్నా.. చెప్పాల్సిన రీతిలో జైలు తప్పదన్న మాట వచ్చిందంటే.. కచ్ఛితంగా అలా జరిగే అవకాశాలు తక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకవేళ జవదేకర్ మాటల్నే యథాతధంగా తీసుకొని.. సీఎం జగన్ మీద చర్యలు తీసుకున్నారే అనుకుందాం? అప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు.. ప్రజల్లోనూ కేంద్రంలోని మోడీ సర్కారు జగన్ ను టార్గెట్ చేసుకొందన్న అభిప్రాయం కలగటం ఖాయం. అదే జరిగితే.. రాజకీయంగా బీజేపీ మరింత నష్టం కలుగుతుంది. అంతేకాదు.. వైసీపీ అధినేత కమ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీదా సానుభూతి వ్యక్తమవుతుంది. గతాన్ని చూస్తే.. ఎవరైనా కీలక నేతల అరెస్టులు జరిగి.. జైలుకు పంపాల్సి వస్తే.. ఆ అంశం గురించి మాట వరసకు కూడా కేంద్ర నేతలు మాట్లాడకపోవటం ఇప్పటివరకు జరిగింది.
అలాంటప్పుడు ప్రకాశ్ జవదేకర్ మాటల్ని చూస్తే.. అవన్నీ సంచలనం కోసమే తప్పించి.. జరిగేవి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలే కానీ.. ఫలానా జరుగుతుందన్న మాటను కేంద్రం చెప్పి.. అందుకు తగ్గట్లు అధికారపక్ష అధినేత అరెస్టు కావటమంటే.. ఏ రాజకీయ పార్టీకైనా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ కోణంలో చూసినప్పుడు.. సంచలనం కోసం.. అధికారపక్ష నేతలు ఉలిక్కిపడటం కోసం తప్పించి.. మరింకేమీ జరగదన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ వాదనలో నిజం ఎంతన్నది కాలమే నిర్ణయించాలి.