‘మద్యపానం నిషేధిస్తామని 2019లో మహిళలకు హామీ ఇచ్చిన విషయం వాస్తవమేనా’ అని ఇటీవల అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రశ్నించారు. ‘ప్రకటించిన పాలసీ ద్వారా మద్యం వినియోగ స్థాయిని తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదే విధానాన్ని కొనసాగిస్తుంది’ అని ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఈ ప్రశ్నకు, జవాబుకు ఎక్కడైనా పొంతన కనిపిస్తోందా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా మద్యపాన నిషేధం హామీ నిజమేనా అని అడిగారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం అవును, లేదు అని ఒక్క ముక్కలో సమాధానమిస్తుంది.
కానీ నేరుగా చెప్పకుండా మద్యం వినియోగాన్ని తగ్గిస్తున్నామని ఎందుకు చెప్పింది? అంటే మద్య నిషేధం చేయడం లేదని పరోక్షంగా చెప్పినట్లే కదా! సాధారణంగా ప్రెస్మీట్లలో ప్రభుత్వం తరఫున మాట్లాడేవారు ఇలా దాటవేసే ధోరణిలో సమాధానాలిస్తారు. కానీ చట్టసభలోనూ ఈ విధంగా జవాబిచ్చే కొత్త సంస్కృతికి జగన్ సర్కారు తెరలేపింది.అయితే ఆ ప్రశ్న అడిగిన టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశాలను బహిష్కరించి వెళ్లిపోవడంతో ఈ అంశంపై సభలో చర్చ జరుగలేదు. కానీ అది ప్రశ్నోత్తరాల్లో వచ్చిన ప్రశ్న కావడంతో డీమ్డ్ టూ బి ఆన్సర్(సమాధానం ఇచ్చినట్లుగా భావిస్తూ)గా పరిగణిస్తూ జవాబు విడుదల చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు అదే ప్రశ్నలోనే ‘సీ’ ప్రశ్న కింద మద్య నిషేధం విధించడానికి తీసుకోనున్న చర్యలేమిటని అడిగారు.
దానికీ డొంక తిరుగుడు సమాధానమే. ప్రభుత్వం రెండేళ్లుగా చెబుతున్న ఆవు కథనే తిరిగి చెప్పింది. ‘43 వేల బెల్టు షాపులు తొలగించాం. మద్యం షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించాం. పర్మిట్ రూమ్లు రద్దు చేసి, పనివేళలు కుదించాం. మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టింది. ఎక్సైజ్ నేరాలకు శిక్షలు పెంచాం’ అని తెలిపింది. ఇందులో ఎక్కడా నిషేధం అనే పదమే లేకపోవడం గమనార్హం. జగన్ గద్దెనెక్కిన 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు మద్యంపై రూ.91,344 కోట్ల ఆదాయం వచ్చింది. 2019-20లో రూ.17,473 కోట్లు, 2020-21లో రూ.17,890 కోట్లు, 2021-22లో 21,432 కోట్లు, 2022-23లో రూ.23,785 కోట్లు, 2023-24లో (ఆగస్టు వరకు) రూ.10,764 కోట్ల ఆదాయం సమకూరిందని ప్రభుత్వమే వివరించింది.
అంటే సెప్టెంబరుతో కలిపితే అది రూ.92 వేల కోట్లు దాటుతుంది. ఆదాయంతో పాటు విక్రయాల వివరాలు కూడా ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు అడుగగా.. ప్రభుత్వం స్పందించలేదు. అయితే తాజా ట్రెండ్ చూస్తుంటే జగన్ ఐదేళ్ల హయాంలో రూ.1.06 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఒక్క మద్యంపైనే రానుంది. ఇప్పటికే విక్రయాలు లక్ష కోట్ల మార్కు దాటిపోయాయి.
అప్పులే అప్పులు
మద్యపాన నిషేధం చేయకపోగా మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపి జగన్ ప్రభుత్వం భారీగా అప్పులు దూసి తెచ్చింది. ఇప్పటివరకూ రూ.12 వేల కోట్లకు పైగా రుణాలను ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా సమీకరించింది. త్వరలోనే మరిన్ని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కనీసం రూ.5 వేల కోట్లయినా తేవాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. ఈ చర్యలతో మద్య నిషేధం లేదని ప్రభుత్వమే పరోక్షంగా చెబుతోంది. అమలుచేయలేక.. మద్య నిషేధం అనేది తమ హామీయే కాదన్నట్లుగా కొత్త వాదన తెరపైకి తెచ్చింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించాం. అందులో ఇవి చెప్పాం, ఇవి చేశామని చెబుతున్నాం.
ఇచ్చిన హామీల్లో 98.5 శాతం అమలుచేశామని గడప గడపలో ప్రజలకు చూపిస్తున్నాం. 76 ఏళ్ల భారతదేశ చరిత్రలో మరే ప్రభుత్వమూ చేయని మహా సాహసం ఇది’ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంకా రూ.3 వేల పెన్షన్ను పూర్తిగా అమలుచేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించలేదు. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయలేదు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామన్న హామీని నెరవేర్చలేదు. అన్నిటికంటే ప్రధానంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలేదు. ఇవేం చేయకుండానే 98.5 శాతం హామీలు అమలు చేశామంటున్నారు. మిగిలిన 1.5 శాతంలోనే మద్యపాన నిషేధం ఉంది.
ఓపీఎస్ లాంటి ప్రధానమైన హామీ కూడా అటకెక్కింది. అంటే జగన్ లెక్కలో మద్యపాన నిషేధం హామీకి అర శాతం కూడా విలువ ఉన్నట్లు కనిపించడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నిజంగా మద్యపాన నిషేధం హామీ అంత చిన్నదే అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతుచించుకుని జగన్ ఊరూవాడా ఎందుకు ప్రచారం చేశారు? మహిళల జీవితాలను ఉద్ధరిస్తామని ఎందుకు హామీలిచ్చారు? మహిళల ఓట్ల కోసం మోసపు హామీలు ఇవ్వడం కాదా అనే ప్రశ్నలు ప్రజల నుంచే వస్తున్నాయి.
2024 సెప్టెంబరు వరకు మద్యం లైసెన్సులు
ఇంకోవైపు.. మద్యపాన నిషేధం ఊసే ఎత్తకుండా జగన్ సర్కారు రాబోయే ఏడాది కాలానికి మద్యం షాపులకు లైసెన్సులు పునరుద్ధరించింది. కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇది అక్టోబరు 1 నుంచి 2024 సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 2,934 షాపులు యథావిథిగా కొనసాగుతాయి. ఇప్పటికే గతేడాది బార్ పాలసీని 2025 వరకు అమల్లో ఉండేలా రూపొందించారు. దీంతో అప్పుడే నిషేధం లేదని పరోక్షంగా చెప్పినట్లైంది. కాగా కనీసం షాపుల వరకైనా రద్దు చేస్తారేమోనని మహిళలు ఆశించారు. ఇప్పుడు అది కూడా లేదని, బార్లతో పాటు షాపులు కూడా యథావిథిగా కొనసాగుతాయని, మద్యం అమ్మకాలకు ఢోకా ఉండదని ప్రభుత్వం తేల్చేసింది.