2019, మే 24న జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం నగరానికి వచ్చారు. అప్పుడు అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ రోజు ఆయన చాలా అంటే చాలా వరాలు ఇచ్చేశారు. వాటి అమలు సంగతే మరిచారు. ఆ రోజు ఆయన వెనుక ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ అయ్యారు. వెనుక ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడిక మంచి ఫాంలో ఉన్నారు కానీ పదవుల ఊసే తప్ప ప్రగతి ఊసు మరిచిపోయారు వీళ్లంతా అన్నది టీడీపీ చేస్తున్న విమర్శ. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిందట జగన్ ఇచ్చిన హామీలేంటి వాటి వివరం,ఆచరణ ఎలా ఉన్నాయి అన్నది చూద్దాం.
జగన్ ప్రకటించిన వరాలివే..
– వైఎస్సార్ భరోసాతో ప్రతి రైతుకూ రూ.50 వేలు
కానీ ఇప్పుడు ఏడాదికి 13 వేల 500 చొప్పున
67 వేల ఐదు వందల రూపాయలు ఈ ఐదేళ్లలో అందించేందుకు
జగన్ సమాయత్తం అయ్యారు.
– డ్వాక్రా సంఘాలకు రూ.15వేల కోట్లతో వైఎస్సార్ ఆసరా
ఇది కూడా అమలవుతోంది కానీ ఏ కొందరికో మాత్రమే అందుతోంది.
– పింఛన్లను వెయ్యి నుంచి రెండు వేలకు పెంపు
పింఛను పెంపు నిర్ణయం చాలా ఆలస్యంగా అయినా అమలవుతోంది.
– నిరుపేద కుటుంబాలకు చదువు నిమిత్తం ఆర్థిక సాయం
ఇది కూడా క్షేత్ర స్థాయిలో పెద్దగా అమల్లో లేని విషయం.
అమ్మ ఒడి ఇస్తున్నా కోతలతోనే కాల యాపన చేస్తున్నారు.
కొత్త నిబంధనల పేరిట కోతలు విధిస్తున్నారు.
– ప్రతి పేదవాడికీ ఇల్లు..అయిదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు
ఇంకా అమలు కాని హామీ ఇది.
– సమర్థంగా ఆరోగ్యశ్రీ అమలు
ఇది కూడా అంతే! కరోనా సమయంలో మినహా మిగతా సందర్భాల్లో
ప్రభుత్వ వైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది.ముఖ్యంగా మంత్రి విడదల రజనీ పర్యవేక్షణే లేదు.
– పూర్తి ఫీజు రీ యింబర్స్ మెంట్ అమలు , ప్రతి విద్యార్థికీ భోజనం వసతి నిమిత్తం ఏటా రూ.ఇరవై వేలు
ఇది కూడా కొన్ని సార్లే.. కొందరికే అందుతోంది. పూర్తి స్థాయిలో అమలు లేదు.
– యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి
ఈ మాట మాత్రం అస్సలు అంటే అస్సలు అమలు కాలేదు.
వంశధార ఫేజ్ 2 పనులు ఇంకా మిగిలే ఉన్నాయి.
– మూడు దశల్లో మద్యపాన నిషేధం
ఇది కూడా అమలు కాని హామీల్లో ఒకటి
మద్య పాన నిషేధం సంగతి అటుంచి ప్రభుత్వం ఆబ్కారీ శాఖపై
విపరీతంగా ఒత్తిడి పెంచి, విపరీతంగా ఆదాయం దండుకుంటుంది అన్న విమర్శ ఉంది
– వీటితో పాటు తాము అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు.
ఈ మాట అస్సలు అమలుకు నోచుకోలేదు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అంటున్నారు కానీ
అది కూడా స్పష్టత లేకుండా ఉంది. జీపీఎస్ అంటే జనరల్ పెన్షన్ స్కీం.
సీపీఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం.