ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటినుంచి రాష్ట్రంలోని సర్పంచ్ ల దుస్థితి వర్ణనాతీతం అని టీడీపీ నేతలు చాలాకారంగా ఆరోపణలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో సర్పంచ్ లు కేవలం తోలు బొమ్మలుగా మారారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్యాంగం సర్పంచులకు కొన్ని హక్కులను ప్రసాదించిందని, కానీ వాటిని జగన్ కాలరాస్తున్నారని టీడీపీ నేతలతోపాటు విపక్ష నేతలు కూడా మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తమ హక్కుల కోసం ఏపీలోని సర్పంచ్ లు నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే, తనకు చెడ్డ పేరు వస్తుండడంతో ఈ నిరసన కార్యక్రమంపై జగన్ ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలోనే జగన్ చేతిలో దగాపడ్డ సర్పంచులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అండగా నిలిచారు. జగన్ పాలనలో పంచాయతీలు తమ ఉనికిని కోల్పోతున్నాయని, పంచాయతీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూవస్తోందని ఆయన ఆరోపించారు.
పంచాయతీలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను కూడా మళ్లిస్తూ జగన్ పబ్బం గడుపుకుంటున్నారని, ఆఖరికి ఆ నిధులనూ దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. తమకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కుల కోసం పార్టీలకతీతంగా సర్పంచులు నిరసన చేపట్టారని, వాటిని ప్రభుత్వం అణచివేయడం దారుణమని చంద్రబాబు గుర్తు చేశారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న సర్పంచ్ లపై కేసులు పెట్టడం, వారిని నిర్బంధించడం జగన్ నియంతృత్వానికి నిలువెత్తు నిదర్శనమని బాబు ఫైర్ అయ్యారు.
సర్పంచ్ ల సంఘం డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారి హక్కులను గుర్తించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలతోపాటు, గ్రామీణ వ్యవస్థలకు పట్టుకొమ్మలైన పంచాయతీలు కూడా నిర్వీర్యం అవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను జగన్ పక్కదారి పట్టించారని, తక్షణమే పక్కదారి పట్టించిన 8700 కోట్ల రూపాయలను గ్రామపంచాయతీల ఖాతాలలో జమ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
టీడీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకే కేటాయించామని, దాంతో వారు భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేయడంతో గ్రామాలలో సర్పంచ్ ల గౌరవం పెరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. అటువంటిది వైసీపీ సర్కార్ సర్పంచ్ లను బిచ్చగాళ్లుగా చూస్తోందని, ఇది దారుణం అని చంద్రబాబు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్న సర్పంచ్ లపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, వారిపై విధించిన నిర్బంధాలను తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.