కొన్నిసార్లు అంతే. కాలం కలిసి రానప్పుడు తాడు కూడా పాములా మారుతుందన్న మాట చెబుతుంటారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ తీరును చూసినప్పుడు ఇదే మాట మనసుకు కలుగుతుంది. ఓవైపు దారుణ ఓటమి భారం.. మరోవైపు ఎదురవుతున్న పరిణామాలు.. పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడి ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ఏం కోరుకుంటారో అదే జరిగేది. తానేం చెప్పాలనుకున్నారో చెప్పేయటమే తప్పించి.. నలుగురి మధ్యకు వచ్చి.. వారి ముందు నిలబడి కాగితాలు చూసుకోకుండా మాట్లాడటం అన్న అలవాటే లేకుండా పోయింది. దీంతో.. సమస్యలు విరుచుకుపడినప్పుడు ఎలా స్పందించాలన్న విషయంలో కొంత ఇబ్బందులు ఆయనకు ఎదురవుతున్నాయి.
అధికారం చేజారిన నెలన్నరకే ఆయన బయటకు అడుగు పెట్టాల్సి రావటం.. అప్పటివరకు తాను కోరుకున్న వాతావరణంలోనే ఉండే జగన్ కు.. ఈ కొత్త పరిణామం కొంచెం కొత్తగా మారిందని చెప్పాలి. పాత మిత్రుడితో ఉన్న పంచాయితీల నేపథ్యంలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్నిపరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు కొత్తగాను.. వేలెత్తి చూపేలా ఉండటం గమనార్హం.
రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే క్రమంలో హత్య చేసిన వ్యక్తి తెలుసా? అని జగన్ అడగటం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం.. హత్యకు గురైన రషీద్.. హత్య చేసిన ఖలీల్ పూర్వరంగంలో ఇద్దరు మంచి స్నేహితులు.. కలిసి తిరిగేవారు. ఆ మాత్రం తెలీకుండానే పరామర్శకు జగన్ వచ్చారా? అన్న ప్రశ్న వ్యక్తమైంది. మొదట్లోరషీద్ తల్లిదండ్రులు తమ కొడుక్కి తెలీదని చెప్పినా.. తర్వాత అసలు విషయాన్ని వెల్లడించారు.
ఇక.. పరామర్శ తర్వాత మీడియాతో మాట్లాడటానికి వచ్చిన జగన్ మాట్లాడుతున్నప్పుడు.. ఒక విలేకరి ‘‘సార్.. బాధిత కుటుంబానికి మీరు ఏ భరోసాను ఇచ్చారు?’’ అని ప్రశ్నించారు. దీనికి అనూహ్య రీతిలో జగన్ నుంచి వచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ఆగప్పా.. చెప్పేటప్పుడు ఫ్లో పోతుంది కదా? ఎంత నువ్వు ఆంధ్రజ్యోతి విలేకరివి అయితే మాత్రం మధ్యలో అడగడం ధర్మం కాదు కదా?’’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏమంటే.. ప్రశ్న అడిగిన విలేకరి ఆంధ్రజ్యోతికి సంబంధించిన వ్యక్తి కాకపోవటం.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అప్పటివరకు చెబుతున్న విషయాన్ని మిస్ అయిన జగన్ అంతకు ముందు తాను చెప్పిన మాటల్నిగుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. జగన్ ఇబ్బందిని గమనించిన ఎంపీ వేణుగోపాల్ రెడ్డి.. మాజీ మంత్రి అంబటి రాంబాబులు కలుగజేసుకొని ఢిల్లీ ధర్నా గురించి చెబుతున్నారని గుర్తు చేశారు. దీంతో.. జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కంటిన్యూ చేశారు.
ఇక.. పరామర్శకు వచ్చిన సందర్భంలో సంబంధం లేని తన ప్రభుత్వ కార్యక్రమాల గురించి.. వాటి పని తీరు గురించి మాట్లాడటం చూసినప్పుడు జగన్ కు ఏమైంది? ఆయన సంబంధం లేని అంశాల్ని హతుడి కుటుంబం వద్ద ఎందుకు మాట్లాడుతున్నట్లు? అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. మొత్తంగా.. జగన్ పరామర్శల్ని చూసినప్పుడు ఆయన సరైన ప్రిపరేషన్ తో రాలేదన్న భావన కలుగక మానదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న వేళలో.. మరింత జాగ్రత్తగా రావాలన్న విషయాన్ని జగన్ ఎందుకు మిస్ అయినట్లు? అన్నది ప్రశ్నగా మారిందిప్పుడు.