మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు అస్సలు రాకూడదు. మనసులోని ఫీలింగ్స్ ను మాటల్లో చెప్పేస్తే.. సదరు అధినేత జగన్ ను నమ్మకున్న లక్షలాదిమంది మనోధైర్యం ఏం కావాలి? అందునా.. సోషల్ మీడియా.. వాట్సాప్ లాంటి మాథ్యమాలు అందుబాటులోకి వచ్చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో నోట్లో నుంచి వచ్చే మాటలు ఆచితూచి అన్నట్లు రావాలి. ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా మొదటికే మోసం.
మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా గులాబీ బాస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నెగిటివ్ గా మారటం తెలిసిందే. ప్రజల ఓట్ల కోసం పదే పదే కోరాల్సిన వేళ.. అందుకు భిన్నంగా రాంగోపాల్ వర్మ స్టైల్లో సినిమాకు వస్తే రండి.. రాకుంటే రాకండన్న మాటలు మాట్లాడితే ఎలా మండుతుందో.. అదే తరహాలో ఓటేస్తే వేయండి.. లేకుంటే మీ ఇష్టం. నాకొచ్చే నష్టమేమీ లేదనేసిన కేసీఆర్ మాటల ప్రభావం ఎన్నికల ఫలితాల మీద బలంగానే వినిపించిన పరిస్థితి.
ఎన్నికల ప్రచారం చేసే వేళలో ఓట్లు వేయాలని అడగాల్సిన పెద్దమనిషి అందుకు భిన్నంగా.. ‘‘బీఆర్ఎస్ ఓడిపోతే నాకొచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. ఏముంటది? గెలిపిస్తే పని చేస్తాం గట్టిగా. లేదంటే ఇంటికాడ పండి రెస్టు తీసుకుంటాం’ అని చేసిన వ్యాఖ్యలకు.. పెద్ద సారుకు రెస్టు అవసరమన్నట్లుగా ఓటర్లు ఫీల్ కావటం.. ఓటమిని కట్టబెట్టటం తెలిసిందే. ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల ప్రచార వేళ.. అదే పనిగా మాట్లాడితే జరిగే నష్టం ఎంతన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్న వేళ.. ప్రచారంలో ఆ తరహాలో మాట్లాడకూదదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి స్పందించటం ఆసక్తికరంగా మారింది. తాజాగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సబ్మిట్ కు హాజరైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా నాకు బాధ లేదు. సంతోషమే. నేను అవసరమైన దాని కంటే ఎక్కువ ఆనందంగా ఉన్నా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని విన్నంతనే.. ఏదో తేడా కొ్ట్టినట్లుగా ఉందన్న అభిప్రాయం గులాబీ నేతల నోటి నుంచి రావటం గమనార్హం.