- నాడు మందుపై ఆదాయం చూపించి 25 వేల కోట్ల రుణం
- నేడు మద్యం ధరలు భారీగా తగ్గింపు
- ఆదాయంపై బ్యాంకులకు ఏం చెబుదాం?
- వైసీపీ సర్కారు డైలమా
హామీలపై మడతేసినా, ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకున్నా.. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ చర్యలకు అర్థాలే వేరు. దశలవారీగా మద్య నిషేధం పేరుతో ధరలు షాక్ కొట్టేలా పెంచి.. ఎవరూ తాగకుండా చేయడమే లక్ష్యమంటూ ఒకప్పుడు ఊదరగొట్టింది. ఇప్పుడు మడమ తిప్పేసి మద్యం ధరలు తగ్గించింది. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా ఆగడంలేదని, నాటుసారా పెరుగుతోందని సాకులు చెప్పింది.
ధరలు పెంచడాన్ని ఎలా సమర్థించుకున్నారో.. తగ్గించుకోవడాన్ని కూడా అంతే గొప్పగా సమర్థించుకుంది. అయితే అసలు కారణం మాత్రం మద్యంపై భారీగా ఆదాయం రాబట్టుకోవడమే. అంతేగాక అడ్డగోలుగా అప్పులు చేస్తున్న సర్కారు.. మద్యంపై భవిష్యతలో వచ్చే ఆదాయం చూపి బ్యాంకుల నుంచి రూ.25,000 కోట్లు అప్పు తెచ్చింది. ఇంకా తెచ్చుకోవడానికి స్పెషల్ మార్జిన్ అంటూ కొత్త రకం ఫీజులు చూపించింది.
ఆ ఫీజుతో పాటు మద్యం సీసాల ధరలు తగ్గించడంతో కొత్త చిక్కు వచ్చి పడింది. అప్పులు తెచ్చిన బ్యాంకులకు, కొత్త అప్పులు తెచ్చుకోవడం కోసం బేరసారాలు జరుపుతున్న బ్యాంకులకు ఇప్పుడు ఏం చెప్పాలి? మద్యం ధరలు తగ్గించినా, జనాన్ని మద్యంలో ముంచెత్తి ఆ ఆదాయంతో అప్పు తీరుస్తామని, కొత్తగా తీసుకునే రుణాలు చెల్లిస్తామని చెబుతారా? లేక ఏ విధంగా అప్పులు తీరుస్తామని చెబుతారు? ఇదే అధికారుల ముందున్న సమస్య.
సొంత బ్రాండ్లతో దోపిడీ
మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులు నడిపినప్పుడు వాళ్లు కోరిన బ్రాండ్లు అందుబాటులో ఉండేవి. జగన్ ప్రభుత్వ లిక్కర్ విధానం వల్ల ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది. జనాలు అడిగినవి కాకుండా వైసీపీ ముఖ్యనేతల సొంత డిస్టిలరీల నుంచి వచ్చే నాణ్యతలేని పిచ్చిబ్రాండ్లు అమ్ముతున్నారు. ఈ తరహా మద్యం విధానానికి వైసీపీ జగన్ పాదయాత్రలోనే బీజం పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
పాదయాత్ర సందర్భంగా తాము అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తామని పదేపదే చెప్పారు. ఇలా డిస్టిలరీలను ప్రభావితం చేసి ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్న నేతలు వాటిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సొమ్ము చేసుకునేందుకే ప్రభుత్వం మద్యం అమ్మకాలకు దిగిందని, అందుకే ప్రముఖ బ్రాండ్లను కావాలనే తప్పించి, సొంత డిస్టిలరీల నాసిరకం బ్రాండ్లను ప్రజలపై రుద్దుతూ దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
తెలంగాణకు అదనంగా 3వేల కోట్లు ఆదాయం
రాష్ట్రంలో మద్య నిషేధం సంగతేమో గాని.. పొరుగు రాష్ట్రం తెలంగాణకు కాసుల వర్షం కురుస్తోంది. ఆదాయం రూ.3,000 కోట్లు పెరిగింది. 2019-20లో ఆ రాష్ట్రానికి మద్యం ద్వారా వచ్చిన ఆదాయం కంటే 2020-21లో రూ.4,000 కోట్లు ఆదాయం పెరిగింది. ఇందులో రూ.3,000 కోట్లు కేవలం జగన్ సర్కారు వల్లే వచ్చిందని అంటున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి ఆంధ్రకు అక్రమ మద్యం దిగుమతి కావడానికి ఇక్కడ ధరలు ఎక్కువగా ఉండటం, ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, అందుబాటులో ఉన్న బ్రాండ్లు నాణ్యత లేకపోవడమే కారణం.
మళ్లీ పాపులర్ బ్రాండ్లు..
రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, ఎంసీ, ఆఫీసర్స్ చాయిస్, కింగ్ఫిషర్, బడ్వైజర్…. మళ్లీ నవ్యాంధ్రకు వచ్చేశాయి. ఇన్నాళ్లూ మద్యం దుకాణాల్లో ఈ బ్రాండ్లు దొరక్క… ఏవేవో బ్రాండ్లు అయిష్టంగానే తాగిన వారంతా తమ ఫేవరెట్ బ్రాండ్లకు క్రమంగా మారిపోతున్నారు. పాత బ్రాండ్ల రాకతో మద్యం దుకాణాలు, బార్లు మందుబాబులతో కళకళలాడిపోతున్నాయి. పెంచిన ధరలను ఇటీవల మరింత తగ్గించి పేదలకు మందును అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. గతంలో ఆపేసిన పాత బ్రాండ్లను కూడా దుకాణాల్లోకి తెచ్చేస్తోంది.
ఎక్సైజ్ శాఖ తెగ ఆర్డర్లు ఇస్తోంది. దీని వెనుక బలమైన కారణమే ఉంది. లిక్కర్ ధరలు పెంచడం, పాపులర్ బ్రాండ్లు మాయం చేయడంతో పేదల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇలాగే కొనసాగితే మరింత పెరుగుతుందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అమలుచేస్తున్న మద్యం పాలసీతో క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నాయకులకు ఎలాంటి లాభం చేకూరడం లేదు.
కమీషన్ల ద్వారా వచ్చేదంతా పెద్దలకే వెళ్తోందనే ప్రచారం తొలి నుంచీ ఉంది. ప్రజల నుంచి తిట్లు తినడం తమ వల్ల కాదని కొందరు నేతలు మొరపెట్టుకున్నారు. అందుకే చెడ్డ పేరును పొగొట్టుకునేందుకు ఒక్కో చర్యా తీసుకుంటున్నారు. మద్యం వ్యాపారంలో పెద్ద తలకాయలుగా ఉన్న పార్టీ పెద్దలు తమ జేబులు నిండాక పాత విధానం తీసుకొస్తున్నారని, ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది.