కార్పొరేషన్ల ముసుగున
రూ.2 లక్షల కోట్లు దాచివేత
గ్రాంట్ ఇన్ ఎయిడ్ పేరుతో
సభనే తప్పుదోవ పట్టించిన వైనం
లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు
నవ్యాంధ్ర అప్పుల రాకెట్, ఆర్థిక శాఖ అబద్ధాల మీటర్ అడ్డూఅదుపూ లేకుండా దూసుకెళ్తున్నాయి. ఆర్థిక శాఖ తనకు అలవాటైన రీతిలో కేంద్రానికి, ఆర్బీఐకి, బ్యాంకులకే కాదు.. సాక్షాత్తూ శాసనసభకే అబద్ధాలు చెప్పింది. ఏ మాత్రం సంకోచం లేకుండా అప్పులపై తప్పుడు సమాచారమిచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరుకోగా.. కేవలం రూ.3.55 లక్షల కోట్లేనంటూ అసెంబ్లీకి తప్పుడు లెక్క సమర్పించింది. గత ఏడాది మే నెలలో జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సమర్పించిన పుస్తకంలో రున్న డి-2 డాక్యుమెంట్ ప్రకారం రాష్ట్రం అప్పు రూ.3,55,874 కోట్లు కాగా ఇందులో కార్పొరేషన్లకు సంబంధించిన అప్పు కేవలం రూ.16,612 కోట్లేనంటూ పెద్ద అబద్ధం రాసి అసెంబ్లీని మోసం చేశారు.
ఒక్క రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ నుంచే ఈ ప్రభుత్వం రూ.25,000 కోట్ల అప్పులు తెచ్చి వాడేసింది. అలాంటిది కార్పొరేషన్ల నుంచి వాడుకున్న అప్పు కేవలం రూ.16,612 కోట్లు మాత్రమేనని డి-2 డాక్యుమెంట్లో రాశారు. తప్పుల లెక్కలతో కూడిన ఇదే డాక్యుమెంట్‌ను కేంద్రానికి కూడా పంపారు.
కేంద్రాన్ని కూడా ఇవే తప్పుల లెక్కలతో మోసం చేస్తున్నారు. అలాగే, ప్రభుత్వం కార్పొరేషన్ల అప్పులకు ఇచ్చిన గ్యారంటీల గురించి తెలియజెప్పే డాక్యుమెంట్ డి-4లో కూడా గ్యారంటీల లెక్కలపై అన్ని అబద్ధాలే రాశారు. 2020-21లో అన్ని కార్పొరేషన్లకు కలిపి కేవలం రూ.19,893 కోట్లు మాత్రమే గ్యారంటీ ఇచ్చినట్లు అవాస్తవం రాశారు.
రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కి నుంచి తెచ్చిన రూ.25,000 కోట్ల అప్పునకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఇరికించి మరీ ఇచ్చిన గ్యారంటీల సంగతి ఏంటి? దీనికి సంబంధించి బ్యాంకులతో ప్రభుత్వం కుదుర్చుకున్న గ్యారంటీ ఒప్పందాలు కూడా బయటకు వచ్చాయి. ఈ అగ్రిమెంట్లకు జగన్ సర్కార్ ఇప్పటి వరకు 11 సార్లు సవరణలు చేసింది. మొత్తం ప్రభుత్వ అప్పులు తెలియజెప్పే డి-2లో, ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారంటీలు తెలియజెప్పే డి-4 డాక్యుమెంట్లో ఇలా రెండింట్లోనూ చూపకుండా దాచేసిన అప్పులు చాలా ఉన్నాయి.
అసెంబ్లీ కళ్లకు గంతలు..
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 29 కార్పొరేషన్ల గ్యారంటీ, నాన్ గ్యారంటీ అప్పులు రూ.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ మధ్యనే సివిల్ సప్లైస్, మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం చెరో రూ.5,000 కోట్లు అప్పు చేసుకునేందుకు గ్యారంటీలు ఇచ్చింది. ఈ 2 లక్షల కోట్ల అప్పుల్లో రూ.1.50 లక్షల కోట్ల పైచిలుకు ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుంది.
వీటికి నెలనెలా ఇన్స్టాల్మెంట్లు కట్టేందుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పేరుతో రాష్ట్ర ఖజానా నుంచి దాదాపు రూ.1800 కోట్లను కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇ స్తోంది. ఈ విషయాన్ని దాచి అసెంబ్లీని ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తోంది. కార్పొరేషన్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎందుకు ఇస్తున్నారో ? దీనికి కారణమేంటో చెప్పకుండా అసెంబ్లీని మభ్యపెడుతున్నారు.
కార్పొరేషన్ల పేరుతో అప్పు తెచ్చి వాటిని ప్రభుత్వ అవసరాల కోసం వాడి మళ్లీ ఆ ఖర్చును కార్పొరేషన్ల ఖాతాలోనే చూపించి ఆ అప్పు తాలూకు అసలు, వడ్డీని మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రి యలో కార్పొరేషన్ నుంచి అప్పు తేవడం, ప్రభుత్వ అవసరానికి వాడడం, ఖర్చును కార్పొరేషన్ ఖాతాలో వేయడం, ఆ అప్పు అసలు, వడ్డీని ప్రభుత్వ ఖజానా నుంచి కట్టడంవరకూ ఏ ఒక్క విషయాన్ని కూడా అసెంబ్లీ దృష్టికి తీసుకురావడం లేదు.
సీజనల్ కార్పొరేషన్లు.. సూటబుల్ సెక్రటరీలు..
ఆర్థిక శాఖ సెక్రటరీలు ఎస్ఎస్ రావత, కేవీవీ సత్యనారాయణ ఏ సీజన్లో ఏ కార్పొరేషన్ నుంచి అప్పు తేవాలనే విషయంలో ఆరితేరిపోయారు. ప్రభుత్వానికి ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత అని సరిచూసుకుని ఆర్థిక శాఖను నడపడం అనేది రాష్ట్రంలో చరిత్ర.
వర్తమానమంతా ఏ సీజన్లో ఏ కార్పొరేషన్ నుంచి ప్రయత్నిస్తే అప్పులు త్వరగా వస్తాయనేది తెలుసుకోవడమే ఆర్థిక శాఖను నడపడానికి కావాల్సిన మొదటిలక్షణం. ఉదాహరణకు రాష్ట్రంలో పంట చేతికొచ్చే సీజన్ మొదలైంది. కాబట్టి, ఆ పంటతో సంబంధం ఉన్న కార్పొరేషన్లను లైన్లో పెడితే ఆ పంటను ఆస్తిగా చూపి అప్పులు తెచ్చుకోవడం సులభమనే ఆలోచన ఆర్థిక శాఖ కార్యదర్శులకు పుట్టింది.
అందుకే వడ్లు సేకరించే సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కి రూ.5,000 కోట్లు, ఇతర పంటలు సేకరించే మార్క్‌ఫెడ్‌కి రూ.5,000 కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి లేకుండానే వీరిద్దరూ పర్మిషన్ ఇచ్చేశారు. ఇప్పుడు రైతుల పేరుతో ఆ అప్పులు తెచ్చి రాష్ట్రం తన సొంత ఖర్చులకు వాడుకుంటోంది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డిపాజిట్లు తీసుకుంటే ఆర్బీఐ ప్రశ్నిస్తోంది కాబట్టి తక్షణమే దాన్ని పక్కన పెట్టేసి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను తెరపైకి తెచ్చారు.
అప్పు రూ.7లక్షల కోట్లు
డి-2 డాక్యుమెంట్లో ప్రభుత్వం చూపిన అప్పు 2021 మార్చి నాటికి రూ.3.55 లక్షల కోట్లు. కార్పొరేషన్ల అప్పులు రూ.2 లక్షల కోట్లు. పెండింగ్ బిల్లులు రూ.లక్ష కోట్లకు పైచిలుకు. 2020-21 మొదటి 6 నెలల్లో వాడిన అప్పు రూ.40,000 కోట్లకు పైనే. ఇవన్నీ కలిపితే ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ.7లక్షల కోట్లకు చేరుకుంది.
ఆర్బీఐ దృష్టిని తప్పించుకునేందుకే..
ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్ ద్వారా డిపాజిట్లు తీసుకోవడాన్ని ఆర్బీఐ వరుస లేఖలతో ప్రశ్నిస్తుండడంతో ఏపీపీఎఫ్సీఎల్ నుంచి డిపాజిట్లు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆర్బీఐ ప్రధానంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం పని చేస్తుంది? తీసుకున్న డిపాజిట్లపై వడ్డీ చెల్లించడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని అడుగుతోంది?
అదొక సూట్‌కేసు కార్పొరేషన్, ప్రభుత్వం తరపున అప్పులు చేయడానికి వాడుతున్నామనే సమాధానం చెప్పలేని ప్రభుత్వం ఏకంగా డిపాజిట్లు సేకరించే కార్పొరేషన్నే మార్చేసింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కి అయితే విద్యుత కొనుగోళ్లు, అమ్మకాలు లాంటి పనులు ఉంటాయి కాబట్టి అంతగా మళ్లీ ఆర్బీఐ అడిగితే విద్యుత కొనుగోళ్లు, అమ్మకాల పేరు చెప్పి తప్పించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.