రాజకీయాలన్న తర్వాత విమర్శలు.. ప్రతివిమర్శలు.. ఆరోపణలు.. ప్రతి ఆరోపణలు మామూలే. అయితే.. ఇటీవల కాలంలో శ్రుతిమించి రాగాన పడ్డట్లుగా మాటలు ఉంటున్నాయి. నిందాపూర్వకంగా మాట్లాడటంలో కొత్త లేదు కానీ.. అవికాస్తా మరింత ఘాటుగా మారుతున్నాయి. మాటలు సరిపోనట్లుగా చేతల్లోకి వెళ్లి.. అరెస్టుల వరకు విషయం వెళుతోంది. ఏపీ విపక్ష నేత చంద్ర బాబు విషయానికి వస్తే.. ఇలాంటివన్నీ కనిపిస్తాయి.
స్కిల్ స్కాం ఆరోపణలతో అరెస్టు చేసిన ఆయన్ను రాజమహేంద్రవరం జైల్లో ఉంచటం ఒక ఎత్తు అయితే.. ఆయనపై మరిన్ని కేసులు నమోదు అయ్యేలా చర్యలు చోటు చేసుకోవటం చూస్తే.. చంద్రబాబును పూర్తిస్థాయిలో టార్గెట్ చేశారన్న అభిప్రాయం విస్త్రతంగా వ్యాపిస్తోంది. ఇలాంటి వేళ.. చంద్రబాబు అరెస్టుపై బహిరంగంగా రియాక్టు అయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైసీపీ విస్త్రత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై మాట్లాడిన ఆయన.. చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని.. ఎందుకంటే ఆయనకు విశ్వసనీయత అన్నదే లేదని.. ఇలాంటి వ్యక్తిని అరెస్టు చేయించాల్సిన అవసరం తమకు లేదని తేల్చారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం తమ ప్రభుత్వానికి అత్యంత అల్పమైన విషయంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మాట మరింత బలంగా వినిపిస్తోంది.
చంద్రబాబు అరెస్టు వెనుక రాజకీయ కుట్ర.. ప్రతీకార చర్య అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందంటూ.. తన వైరి వర్గాన్ని మాటలతో టార్గెట్ చేశారు. చంద్రబాబు అరెస్టుపై మాట్లాడే క్రమంలో.. తాను ఆ సమయంలో లండన్ లో ఉన్నట్లుగా గుర్తు చేసిన జగన్ హావభావాలు.. ఆయన ముఖంలో నవ్వు.. చంద్రబాబు అరెస్టు తమకు సంబంధం లేదన్న వాదనను వినిపించే వేళ.. దాన్ని నమ్మేలా కనీసం మాటలున్నా బాగుండేది. కానీ.. అవేమీ లేకుండా ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చని.. కానీ.. ఈ రీతిలో రియాక్షన్ సరికాదంటున్నారు. జగన్ సైతం అవినీతి ఆరోపణలతో నెలల తరబడి జైల్లో ఉన్నారని.. అప్పుడెప్పుడు కూడా చంద్రబాబు.. అరెస్టుపై ఈ రీతిలో నోరు పారేసుకున్నది లేదని గుర్తు చేస్తున్నారు. బాబు అరెస్టులో తన ప్రమేయం లేదన్న జగన్.. బీజేపీ.. పవన్ ఉండగా బాబు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న జగన్ ప్రశ్నలో కొంటెదనం అందరికి అర్థమయ్యేలా చేసిందంటున్నారు.
అంతేకాదు.. బాబు అరెస్టుకు జస్టిఫికేషన్ ఇచ్చేందుకు గతంలో ప్రధాని మోడీ సైతం బాబు అవినీతిపై మాట్లాడిన వైనాన్ని గుర్తు చేయటం చూస్తే.. అవినీతి చేశారన్నది తమ ప్రభుత్వం మాత్రమే కాదు.. కేంద్రం కూడా చెప్పేసింది కదా? అన్న మాటే జగన్ మాటల్లో ఎక్కువగా ధ్వనిస్తుందని చెప్పాలి.