యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కుపోయారు. రాజ్య సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా నలుగురిని ఎంపిక చేయగా, అందులో ఇద్దరు తెలంగాణకు చెందిన వ్యక్తులకే చోటు ఇవ్వడం వివాదానికి ప్రధాన కారణం. వాస్తవానికి త్వరలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఎందరో ఆశావహులు ఉన్నా కూడా వారిని కాదని, తెలంగాణకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టడం ఎంత వరకూ సమంజసం అని ఏపీ నిరుద్యోగ జేఏసీ నిన్నటి వేళ రోడ్డెక్కింది.
తక్షణమే ఈ నియామకాలను లేదా నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిన్నటి వేళ తీవ్ర స్థాయిలో తమ గొంతుక వినిపించారు. ముఖ్యంగా ఆంధ్రా ద్రోహులకు పదవులా అంటూ మండిపడుతూ.. గతంలో ఆంధ్రుల సమస్యలపై కానీ లేదా నిబంధనల అనుసారం ఇక్కడి నిరుద్యోగులకు అక్కడ అవకాశాలు దక్కే విషయమై కానీ ఏనాడూ మాట్లాడని ఆర్.కృష్ణయ్య కానీ నిరంజన్ రెడ్డి కానీ ఏ విధంగా ఈ పదవులకు అర్హులో జగన్ మాత్రమే చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు.
విభజన సమస్యలపై ఇప్పటిదాకా గొంతెత్తని ఆ ఇద్దరూ, ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో ఆంధ్రా వాటాలు ఏంటి ఎంత అని తేల్చేందుకు ప్రయత్నించని వాళ్లు, కనీసం ఈ ఎనిమిదేళ్లలో ఈ ప్రాంత సమస్యలపై గొంతెత్తని వారు ఎలా పదవులు అందుకుంటారు అని ప్రశ్నిస్తూ భిక్షాటన చేస్తూ నిన్నటి వేళ విజయవాడలోనిరసనలు తెలిపారు. తక్షణమే ఈ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గకపోతే నిజంగానే బీసీలకు వైఎస్సార్సీపీ దూరం కావడం తథ్యం అని అంటూ హెచ్చరించారు. తాము బీసీలకు ఆత్మ బంధువులం అని చెప్పుకునే నాయకులు కూడా ఇదే విషయమై తీవ్ర స్థాయిలో స్పందించకపోవడం అన్నది ఎందుకనో ఆమోదయోగ్యంగా లేదని,
ఈ విషయమై తమకు పలు సందేహాలు ఉన్నాయని ఇంకొందరు నిరుద్యోగ జేఏసీకి మద్దతుగా సోషల్ మీడియాలో స్టేటస్ లు పెడుతున్నారు. మరి వీటిపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలిక.