“దళితులు ప్రాణభయంతో ఏపీలో జీవితాలను సాగిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఎటు నుంచి దాడులు చేస్తారో.. మారణ కాండకు దిగుతారో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు దళితులు ఆయుధాలు చేతబట్టుకుని తిరగాలి!“- టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, దళిత వర్గానికి చెందిన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తాజాగా చేసిన సంచలన ప్రకటన.
వాస్తవానికి దళితులు ఆయుధాలు పట్టుకుని తిరగాలి అనడం.. సంచలనమే. అంతేకాదు, వివాదం కూడా. కానీ, జవహర్‌పై ఎవరూ ఎదురు దాడి చేయలేదు. ముఖ్యంగా వైసీపీలోని ఎస్సీ, ఎస్టీ నాయకులు, మంత్రు లు కూడా ఈ విషయంపై స్పందించలేదు. అంటే.. ఏపీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారు కూడా.. దీనికి అంగీకరిస్తూ అయినా అయి ఉండాలి. లేదా మనం చెప్పలేనిది టీడీపీ నేత చెప్పాడని అనుకొనైనా ఉండాలి. మొత్తానికి జవహర్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు వైరల్ అయింది.
ఎందుకు ఇంతగా స్పందించాల్సి వచ్చింది? అనేది కీలక ప్రశ్న. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ పాలన చేపట్టిన తర్వాత ఎందుకో కారణాలు తెలియవు కానీ.. క్షేత్రస్థాయిలో దళితులపై దాడులు, పోలీసుల కేసులు, లాఠీచార్జీలు అమానవీయ ఘటనలు పెరిగిపోతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా కనిపించడం లేదు. కరోనా సమయంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌పై పోలీసులే విరుచుకుపడ్డారు.
తర్వాత.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన కారు డ్రైవర్‌ను దారుణంగా హత్య చేశారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదే.. శవాన్ని కారులో డోర్ డెలివరీ కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. ఇదిలావుంటే, ఉన్నతస్థాయిలో అధికారులను కూడా అవమానించిన ఘటనలు కూడా తెరమీదికి వచ్చాయి. ఇక, తాజాగా టీడీపీకి చెందిన ఎస్సీ నాయకుడిని చిత్తూరు జిల్లా పోలీసులు దారుణంగా కొట్టడం.. నోట్లో గుడ్డలు కుక్కి.. హింసించడం సంచలనంగా మారింది.
మరో వైపు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రధాన అనుచరుడి బంధువు.. దళితుడైన కాండ్రు శ్యామ్‌తో మూత్రం తాగించి, తీవ్రంగా హింసించడం చర్చనీయాంశంగానే కాదు తీవ్ర రచ్చకు దారితీసింది. అయితే.. ఇంత జరుగుతున్నా.. సీఎం జగన్ స్పందించడం లేదు. చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రి జవహర్ ఇచ్చిన పిలుపు సంచలనం కావడమే కాకుండా.. చర్చకు కూడా దారితీయడం గమనార్హం.