ఏపీలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా జగన్ ఢిల్లీ టూర్ తర్వాత మాత్రం ఆ పుకారు మరింత జోరుగా షికారు చేస్తోంది. మామూలుగా సీఎం టూర్ విషయాలను అఫీషియల్ గా ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేస్తుంటారు. లోపల ఏం మాట్లాడినా సరే…రాష్ట్ర ప్రయోజనాలు, రావాల్సిన నిధులు, హోదా గురించి మాట్లాడుకున్నాం అని చెబుతుంటారు.
కానీ, లోపల అనధికారికంగా ఏం చర్చించారన్నదానిపై, అంతర్గతంగా రాజకీయాలపై ఏం చర్చ జరిగిందన్నది అధికారికంగా ఎప్పటికీ తెలియదు. అయితే, ఢిల్లీలోని పొలిటికల్ సర్కిల్స్ లో ఉండే కొందరు లీకు వీరులు మాత్రం ముందస్తు ఎన్నికల కోసం కేంద్రం పెద్దల అనుగ్రహం పొందడమే ఎజెండా ఢిల్లీలో పర్యటించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఏప్రిల్ తర్వాత అసెంబ్లీని రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల వద్ద అనుమతి తీసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ నేతలు, కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయంటూ బుకాయిస్తున్నారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం కూడా ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగమేనట. మార్చిలో ఈ కార్యక్రమం ముగించిన తర్వాతే ఎవరెవరికి టిక్కెట్లు కేటాయిస్తానో ప్రకటిస్తానని జగన్ కూడా స్పష్టం చేశారు. తాజాగా ఏప్రిల్ లో ముందస్తు ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
మార్చిలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఏప్రిల్ తర్వాత ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలపై అధికారిక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. ఇందుకు హింట్ అందడంతోనే లోకేష్ కూడా పాదయాత్ర మొదలుబెట్టబోతున్నారట. పవన్ కూడా వారాహితో యాత్ర ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు కూడా..ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని సిద్ధంగా ఉండాలని తమ క్యాడర్‌కు పిలుపునిచ్చారు.
వాస్తవానికి జగన్ సొంతంగా నిర్ణయిం తీసుకొని అసెంబ్లీని రద్దు చేస్తే చాలదు. కచ్చితంగా ఎన్నికలకు కేంద్రం పెద్దల సహకారం ఉండాలి. జగన్ నిర్ణయం నచ్చకుంటే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించొచ్చు కూడా. అందుకే, ఢిల్లీ టూర్ లో పర్మిషన్ తెచ్చుకున్నారని, ఇక, ముందస్తుపై ప్రకటనే తరువాయి అని అనుకుంటున్నారు.