“మాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి.. కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తాం “ – 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీఅధినేత, ప్రస్తుత సీఎం జగన్ ఇచ్చిన హామీ ఇది. దీనికి ప్రజలు ఫిదా అయ్యారు. అప్పటి హోదా కాకలో వైసీపీకి అనుకూలంగా ఓటెత్తారు. ఫలితంగా వైసీపీకి 22 స్థానాల్లో ఎంపీలు దక్కారు. అయితే.. తర్వాత హోదా విషయం మరుగున పడింది.
కానీ, ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత మరోసారి ఈ విషయం తెరమీదికి వచ్చింది. ఇదేదో ఎన్నికల సీజన్ కాబట్టి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని లేవనెత్తలేదు. ఎవరూ రెచ్చగొట్టనూ లేదు. కానీ.. ఎక్కడో ఉన్న బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడ చేసిన సంచలన ప్రకటన ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, ఇవ్వకపోతే.. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని సాక్షాత్తూ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు.
ఈ ప్రకటన బిహార్లో సంచలనంగా మారింది. మరో ఏడాదిలో బిహార్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే కుల గణనతో దూసుకుపోయి.. ప్రజలను తనవైపు తిప్పుకొన్న నితీష్.. ఇప్పుడు కీలకమైన హోదాపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి ఈ పరిణామం మింగుడు పడడం లేదు. ఇలాంటి సమయంలో ఇదే హోదా కోసం.. కొన్నాళ్లు ఉద్యమించి.. ఏకంగా .. గత చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో వైరం కూడా పెట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే అప్పటి ఎన్నికల్లో హోదాను ప్రధానాస్త్రంగా చేసుకుని వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో హోదా అంశాన్ని ప్రస్తావించారు. అయితే.. తర్వాత దాన్ని ఆయన వదిలేశారు. ఇక, ఇప్పుడు బిహార్లో సీఎం ప్రకటించడంతో ఏపీ సీఎం ఏం చేస్తారనే ప్రశ్న క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. ఎన్నికలు వస్తుండడం.. హోదా కోసం అన్ని వర్గాలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో అక్కడి సీఎం పాటి ధైర్యం ఇక్కడ సీఎం చేస్తారా? లేదా? అనే చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.