ఏపీలో పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ ఉండడంతో అన్ని రాజకీయ పార్టీల కీలక నేతలు తమ అభ్యర్థుల గెలుపునకు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారా లోకేశ్…జగన్ పై సెటైర్లు వేశారు. అన్నీ పెంచుకుంటూ పోతానని జగన్ గతంలో హామీ ఇచ్చారని, అయితే, మద్యం ధరలు, నితావ్యస సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలు..అన్నింటి రేట్లు పెంచుకుంటూ పోతాడని అనుకోలేదని ఎద్దేవా చేశారు.
అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, పండుగల తోఫా వంటి పథకాలను జగనన్న కట్ చేసి కటింగుల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. గత రెండున్నరేళ్లుగా కుప్పం పేరు కూడా జగన్ నోటి నుంచి రాలేదని, ఇక్కడ ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించి కుప్పంలో మకాం వేసిన వైసీపీ కుక్కలను తరిమికొట్టాలని లోకేశ్ పిలుపిచ్చారు.
గతంలో మంత్రి హోదాలో తాను రూ.300 కోట్లతో కుప్పాన్ని అభివృద్ధి చేశానని, వైసీపీ కనీసం రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. ఏం పీకారని సిగ్గు లేకుండా ఇక్కడికొచ్చారని వైసీపీ నేతలపై లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ నాయకులు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కేసే రకమని, వారి ప్రలోభాలకు దూరంగా ఉండాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తాము గతంలో ప్రతిపక్ష పార్టీకి స్వేచ్ఛనిచ్చామని, ఇప్పుడు టీడీపీ నేతలను జగన్ అగడుగునా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కుప్పంలో తమ ఇంటి తలుపులు జనం కోసం తెరిచే ఉంటాయని, జగన్ ఇంటికి పెద్ద నాయకులు కూడా వెళ్లలేకపోతున్నారని అన్నారు.