దేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి విషయంలోనూ జరగని ఒక సంచలన నిర్ణయం ఏపీలో జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజల సొమ్ముతో ఆయన కుటుంబానికి పూర్తి భద్రత ఏర్పడనుంది. ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబ సభ్యులైన భార్య, ఇద్దరు పిల్లలు, మాతృమూర్తి విజయమ్మలు.. దేశంలోనే కాకుండా.. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. జనం సొమ్ముతో అత్యంత పటిష్ఠమైన భద్రతను కల్పించనున్నారు.
ఈ మేరకు.. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి.. హరీష్‌కుమార్ గుప్తా జీవో జారీ చేశారు. కొన్నాళ్ల కిందట ఏపీ ప్రభుత్వం.. సీఎం జగన్, ఆయన సతీమణి, కుమార్తెలు, సీఎం తల్లికి ఎస్ ఎస్ జీ(స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్) భద్రత కల్పించాలని తీర్మానం చేసింది. అంటే.. కేవలం రాష్ట్రంలోనే కాకుండా.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. వీరికి ఎస్ ఎస్జీ భద్రత కల్పిస్తారు. దీనికి అయ్యే ఖర్చును రాష్ట్ర ఖజానా నుంచే భరిస్తారు. ప్రస్తుతం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో అత్యున్నత విద్యను చదువుతున్నారు.
అదేవిధంగా సీఎం తన సతీమణితో కలిసి ఏడాదికి రెండు సార్లు జెరూసలేం సహా.. ఇతర దేశాలకు ప్రయాణిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి కుటుంబానికి ఎస్ ఎస్ జీ దళాలు భద్రత కల్పించనున్నాయి. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం ప్రపంచంలోని ఏదేశానికి వెళ్లినా.. వారి వెంట ఎస్ ఎస్ జీ(స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్) ఉంటుంది. ముఖ్యమంత్రి లేదా.. ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు.. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్లినా.. అనుక్షణం వీరిని కనిపెట్టుకుని ఎస్ ఎస్ జీ కమెండోలు ఉంటారు.
విందులు, ఇతర కార్యక్రమాలు సహా.. ప్రైవేటు కార్యక్రమాలు, అధికారిక పర్యటనలు ఇలా.. కార్యక్రమం ఏదైనా వీరు నిఘా ఏర్పాటు చేస్తారు. అంతేకాదు.. విధుల్లో భాగంగా ఎస్ ఎస్ జీ దళం ఎవరిపైనైనా చేయి చేసుకున్నా.. ప్రశ్నించకుండా.. న్యాయ పరమైన భద్రత కల్పించడం గమనార్హం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. గత ఏడాది డిసెంబరు 23 నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. కాగా, నిజానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్న సందర్భాలు లేకపోవడం గమనార్హం.