రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసే విషయంలో ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు అనగానే వెన్నుపోటుదారుడని.. పవన్ కళ్యాణ్ అనగానే దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, పెళ్లిళ్లు అని ఊకదంపుడు పదాలు వాడడం ఆయనకు అలవాటైపోయింది. ఈ మధ్య తాను ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి బహిరంగ సభల్లో ప్రత్యర్థుల మీద చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యానాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
ప్రత్యర్థుల మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంలో మరీ దిగజారిపోతున్నారని విమర్శలను జగన్ ఎదుర్కొంటున్నారు. ఓవైపు పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే ఆయన.. తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యర్థులను టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఒక బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కుటుంబాల్లో చిచ్చు పెడతారని, రాజకీయాలు చేస్తారని ఆవేదన స్వరంతో మాట్లాడారు.
జగన్ వ్యాఖ్యలు తన సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో చేసినవే అన్నది స్పష్టం. ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతుండడం, ఎన్నికల్లో కూడా పోటీ చేసేలా కనిపిస్తుండడంతో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే షర్మిలను ఎవరో రెచ్చగొట్టి జగన్ కు వ్యతిరేకంగా బరిలో నిలుపుతున్నారని అనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది. తాను జైల్లో ఉండగా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిన షర్మిలకు న్యాయం చేయకుండా దూరం పెట్టింది జగనే అన్నది జగద్విదితం.
తాను బయటికి వచ్చాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిలకు టికెట్ ఇచ్చి పోటీ చేయించలేదు. అంతేకాక ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీనికి తోడు ఆస్తులు విషయాల్లోనూ గొడవలు జరగడంతో విధిలేక షర్మిల వైఎస్ఆర్టిపి పార్టీ పెట్టుకుని తెలంగాణకు వెళ్లిపోయారు. జగన్ షర్మిల మధ్య సంబంధాలు సరిగా లేవని పలు సందర్భాల్లో స్పష్టమైంది. అన్నా చెల్లెళ్లు ఇద్దరూ రెండేళ్లకు పైగా ఇద్దరు ఒక్కసారి కూడా కలవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇందులో బయటి వారి ప్రమేయం ఏమీ లేదన్నది బహిరంగ రహస్యం. అలాంటప్పుడు జగన్ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం విడ్డూరం. తన కుటుంబంలో చిచ్చు పెట్టుకున్నది జగనే అన్నది అందరికీ తెలిసిన విషయమే.