ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై సంచలన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల తాజాగా తన సోదరుడిపై మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. వైఎస్సార్ కుటుంబాన్ని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి వైఎస్ కుటుంబాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని, జగనన్న అని సంచలన ఆరోపణలు చేశారు షర్మిల. జగనన్న ఒక నియంత అని, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నాడని షాకింగ్ కామెంట్లు చేశారు.
జగనన్న వల్లే వైఎస్ఆర్ కుటుంబంలో కలతలు రేగాయని ఆమె ఆరోపించారు. ఇంటిని, పిల్లలను వదిలేసి ఎండనక, వాననక రోడ్లమీద ఉండి పాదయాత్ర చేశానని, అయినా జగనన్న తనకు అన్యాయం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కుటుంబం ముక్కలు కావడానికి జగనన్న తనను తానే నిందించుకోవాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తాను చేస్తున్న ఆరోపణలకి మూడు సాక్షాలున్నాయని, ఒకటి దేవుడు, రెండు…తన తల్లి విజయమ్మ, మూడు వైఎస్ కుటుంబ సభ్యులు అని షర్మిల ఆరోపించారు. జగనన్నకు, తమకు మధ్య ఏం జరిగింది అన్న విషయం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు.
ఇక, తనతో పాటు రాజీనామా చేసి వచ్చిన 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులను చేస్తానని జగనన్న హామీ ఇచ్చారని, వారిలో ఈరోజు ఎంతమంది మంత్రులుగా ఉన్నారని షర్మిల ప్రశ్నించారు. బై బై బాబు అంటూ ఊరూరా తిరిగానని, దేశంలోనే అత్యంత విజయవంతమైన పాదయాత్ర చేశానని గుర్తు చేసుకున్నారు. జగనన్న అడిగితే ఎందుకు, ఏమిటి అనకుండా, స్వలాభం చూసుకోకుండా, మారు మాట్లాడకుండా పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేసి అన్నకు అండగా నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయాడని, తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా మంచి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటాడని ఆశించానని అన్నారు.