విద్యుత్ చార్జీల ను ఏపీలోని కూటమి ప్రభుత్వం పెంచిందని ఆరోపిస్తూ రేపటి నుంచి వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్, మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ నేతలే ధర్నాలకు పిలుపునివ్వడం హాస్యాస్పదమని, ఇదో ప్రపంచ వింత అని ఎద్దేవా చేశారు. కలెక్టరేట్లకు బదులు జగన్ ఇంటి ముందు ధర్నాలు చేయాలని చురకలంటించారు.
ఈఆర్సీకి విద్యుత్ ఛార్జీలు పెంచాలని సిఫారసు చేసింది జగన్ కాదా? అని గొట్టిపాటి ప్రశ్నించారు. విద్యుత్ రంగ వ్యవస్థలను జగన్ నాశనం చేశారని, సొంత మనుషులకు దోచి పెట్టేందుకు అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కరెంటు ట్రూఅప్ చార్జీల కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో విద్యుత్ వ్యవస్థను ఆయన నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు.
ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపిన జగన్ ఈ రోజు ధర్నాలు, ర్యాలీలు చేయడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు విమర్శించారు. యూనిట్ విద్యుత్ రూ.5కే వస్తున్నా కొనకుండా కమీషన్ల కోసం యూనిట్ విద్యుత్ రూ.8కి కొన్నారని విమర్శించారు. ఆనాడు జగన్ చేసిన పాపాలు నేడు ప్రజలకు శాపాలుగా మారాయని అన్నారు.