జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాల వ్యవహారంపై పవిత్రమైన అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తేలిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో వరుస మరణాల తర్వాత గత 4 రోజులుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పోలీసు జరిపిన దాడుల్లో షాకింగ్ విషయాలు బట్టబయలు కావడంతో జగన్ గుట్టురట్టయింది. సాక్ష్యాత్తూ జంగారెడ్డిగూడెంలోనే నాటుసారా కాయడానికి ఉపయోగించే వెయ్యి లీటర్ల బెల్లం ఊటను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే అక్కడ నాటుసారా ఏ రేంజ్ లో ఏరులై పారుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క జంగారెడ్డిగూడెంలోనే నాటుసారా కాస్తున్న 22 మందిని అరెస్టు చేసిన పోలీసులు..43 కేసులు నమోదు చేశారంటే ఆ ప్రాంతంలో నాటుసారా…మినరల్ వాటర్ దొరికినంత ఈజీగా దొరుకుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయపాలెం, జీలుగుమల్లి, కొయ్యలగూడెంలో ఆ కేసులు నమోదుకావడం విశేషం. జంగారెడ్డిగూడెం టౌన్, రూరల్ పరిధిలోనే 9 కేసులు నమోదయ్యాయి. ఏపీలో నాటుసారా తయారీలో తూ.గో.జిల్లా మొదటి స్థానంలో ఉండగా ప.గో. జిల్లా మూడో స్థానంలో ఉంది.
గత నాలుగు రోజుల్లో నమోదైన కేసుల్లో 40.38%, నిందితుల్లో 52.43% మంది, ధ్వంసం చేసిన బెల్లం ఊటల్లో 54.58%, స్వాధీనం చేసుకున్న నాటు సారాలో 50.28% తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయంటే ఈ రెండు జిల్లాల్లో సారా సెలయేళ్లు పారుతున్నట్లే. పశ్చిమగోదావరి జిల్లా మన్యంలోని పలు గ్రామాలలో తయారైన నాటుసారా అక్కడి నుంచి కొయ్యలగూడెం, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, ఏలూరు, చింతలపూడి, భీమవరం, తణుకు తదితర పట్టణాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి నాటు సారా ప్యాకెట్ల రూపంలో తరలుతోందన్న ఆరోపణలున్నాయి.
ఆ ఆరోపణలపై విచారణ చేయాల్సిన ఎస్ఈబీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఆరోపణలున్నాయి. వారి పట్ల సెబ్ ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది? అసలు మన్యంలోనే నాటుసారా తయారవుతోందా..లేక జంగారెడ్డిగూడెంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా గుట్టుగా నాటుసారా తయారు చేస్తున్నారా అన్న కోణంలో విచారణ జరపకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలతో ఆ పట్టణంలోని సారా వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిని బట్టి అంతకు ముందు నుంచే అక్కడ సారా విక్రయాలు జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. కొందరు సారా వ్యాపారులు అధికార పార్టీకి చెందిన నేతల అండతో చలామణి అవుతున్నారని, అందుకే ఎస్ఈబీ అధికారులు మామూళ్లు తీసుకొని చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇదంతా, నాటుసారా తయారీ, ఎస్ఈబీ అధికారుల ఉదాసీనత ప్రభుత్వానికి తెలియకుండా ఉండే అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్…నాటుసారా, కల్తీ సారా, అక్రమ మద్యం, నాసిరకం మద్యం తయారీదారులపై ఉక్కుపాదం మోపి ఉంటే ఆ 26 మంది మరణించేవారు కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక, గణాంకాలతో సహా నాటుసారా గుట్టురట్టు కావడంతో జంగారెడ్డిగూడెం పాపం జగన్ దేనంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.