ఈ ఏడాది ఎన్నికల సమయంలోను దీనికి ముందు కూడా.. వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ చెప్పిందేంటి? ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టింది ఏంటి? అని పరిశీలిస్తే.. అంతా మంచే చేశామని.. ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజలకు మేళ్లు చేశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు.,. “మా వల్ల మంచి జరిగిందని అనుకుంటే ఓటేయాలి“ అని కూడా జగన్ పిలుపునిచ్చారు. దీంతో 40 శాతం సుమారు ఓటర్లు ఆయనకు, ఆ పార్టీకి ఓట్లేశారు.
అంటే.. ఒకరకంగా జగన్ మేలు చేశారని ప్రజలు భావించినట్టే కదా? అంతా మంచే చేశానని చెప్పుకొన్న జగన్ మాట విన్నట్టే కదా! మరి అలాంటప్పుడు.. ఆయనకు ప్రాణ భయం ఎందుకు? ఇతర భయాలతో పనేంటి? అనేది ప్రశ్న. ఎందుకుంటే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదని, తన ప్రాణాలకు ముప్పు ఉన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని జగన్ భావించారు. దీనిని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ నేపథ్యంలోనే జగన్ అసలు అంతా మంచి చేసినప్పుడు.. ఎందుకు ఇంత ప్రాణ భయం? అనేది మిలి యన్ డాలర్ల ప్రశ్న. అందరికీ రూ.2.7 లక్షల కోట్ల రూపాయలను డీబీటీలో పంపిణీ చేశారు. పైగా నాడు-నేడు, అమూల్ పాల సేకరణ.. ఇలా విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారు. అందరికీ ఐశ్వర్య వంతులుగా చేయాలని భావించారు. ఆ విధంగానే అడుగులు వేశారు. మరి అలాంటప్పుడు.. జగన్కు శత్రువులు ఎవరుంటారు? ఆయన ప్రాణాలు తీసేంత కసి ఎవరికి ఉంటుంది?
పైగా గత ఐదేళ్లలో ఏమైనా సంచలన, వివాదాస్పద నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? అంటే అది కూడా లేదు. పోనీ.. గతంలో చంద్రబాబు మాదిరిగా ఫ్యాక్షనిస్టులను ఏరేశారా? మావోయిస్టులను కట్టడి చేసే నిర్ణయాలు తీసుకున్నారా? అంటే అది కూడా లేదు. అసలు ఐదేళ్లలో జనాల్లోకి వచ్చింది కూడా లేదు. వచ్చినా పరదాలు కట్టుకుని, చెట్లు కొట్టుకుని రావడమే తప్ప.. నేరుగా వచ్చింది కూడా లేదు. మరి అలాంటప్పుడు అసలు ప్రాణభయం అనే మాట ఎక్కడుందనేది ప్రశ్న. మరి దీనికి వైసీపీ నాయకులు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.