ఏపీ రాజధాని అమరావతి వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని సంచలన తీర్పునిచ్చింది. అయితే, తాము ఆ నిర్మాణాలను హైకోర్టు నిర్దేశించిన ఆరు నెలల లోపు పూర్తి చేయడం సాధ్యంకాదంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతానికి ఆ వ్యవహారం పెండింగ్ లో ఉంది.
మరోవైపు, ఏపీ రాజధాని అమరావతి అని తీర్పు రావడం, జగన్ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు నిండుకోవడంతో విశాఖకు రాజధాని తరలింపు దాదాపు అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని కీలక ప్రభుత్వ రంగ సంస్థలు, కార్యాలయాలు అమరావతికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖటపట్నం కేంద్రంగా పనిచేస్తోన్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (BIS) ఆఫీసు త్వరలోనే విజయవాడకు షిఫ్ట్ కానుంది.
వాటర్ బాటిళ్ల నుంచి బంగారం వరకు అనేక రకాల ఉత్పత్తులకు బీఐఎస్ మార్క్ తప్పనిసరి. బీఐఎస్ సర్టిఫికెట్ ఉంటేనే నాణ్యమైన ఉత్పత్తులని పేరు. వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉత్పత్తులు ఉండేలా చూడడం, ఎగుమతులను పెంచడంలో బీఐఎస్ది కీలక పాత్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, విశాఖ నగరాల్లో బీఐఎస్ ఆఫీసులున్నాయి. వైజాగ్లో 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ సంస్థ కార్యాలయం.. త్వరలోనే విజయవాడకు మారనుంది. ప్రస్తుతం వీఎంఆర్డీఏ ప్రాంగణంలో ఈ ఆఫీసు ఉంది.
అన్ని జిల్లాల ప్రజలతోపాటు అందరికీ అనువుగా ఉండేలా బీఐఎస్ కేంద్రాన్ని విజయవాడకు మార్చాలని నిర్ణయించారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో విశాఖ నుంచి ఈ ఆఫీసుకు విజయవాడకు మారనుంది. ఈ క్రమంలోనే తాజాగా మూడు రాజధానుల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. మూడు ముక్కలాటపై జగన్ మెత్తబడ్డారనేందుకు ఇదే ప్రూఫ్ అని, జగన్ ఆమోదించిన తర్వాతే ఆ ఆఫీసు విజయవాడకు తరలుతోందని అంటున్నారు.