తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఏపీ రాజధాని అమరావతిపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటున్న వైసీపీ నేతలు మూడు రాజధానులుపై కొత్త బిల్లు పెట్టి తీరుతామని చెబుతున్నారు. అమరావతి రాజధాని అని చెప్పిన కోర్టు ఆదేశాలను కూడా తాము ధిక్కరిస్తామంటూ పరోక్షంగా ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు .
ఇక, మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే మరో అడుగు ముందుకు వేసి వచ్చే ఏడాది విశాఖ నుంచి పరిపాలన చేస్తామంటూ ప్రకటన చేశారు.ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా చూపించలేదని జీవీఎల్ విమర్శలు గుప్పించారు.
ఏపీలో మూడు రాజధానులు నిర్మించడం సాధ్యం కాదని జగన్, వైసీపీ నేతలకు తెలుసని, అయినా సరే మూడేళ్లుగా మూడు రాజధానులు అంటూ వేసిన క్యాసెట్టే మళ్లీ వేసి వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో వైసీపీ నేతలు భూదందాలు చేయడానికి రాజధాని కావాలంటున్నారని జీవీఎల్ దుయ్యబట్టారు. విశాఖపట్నంపై అంత ప్రేమ ఉన్న వైసీపీ నేతలు విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంపై ఎందుకు శ్రద్ధ వహించలేదని జివీఎల్ ప్రశ్నించారు.
విశాఖ అభివృద్ధికి రాష్ట్రం తరఫునుంచి ఎన్నో సహాయ సహకారాలు కావాల్సి ఉందని, కానీ, అవేవీ అందడం లేదని జివీఎల్ ఆరోపించారు. విశాఖ అభివృద్ధికి సహకరించని జగన్ విశాఖ రాజధాని అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని జీవీఎల్ మండిపడ్డారు. అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటామని కేంద్ర సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నా జగన్ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.