జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడపలో ఈరోజు రైతు భరోసా యాత్ర నిర్వహించారు పవన్. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పవన్ ఆర్థిక సహాయం అందించారు. కడప జిల్లా సిద్ధవటం లో ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొన్న పవన్….ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు స్వయంగా చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జగన్ సొంత ఇలాకాలోనే ఆయనపై పవన్ విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రెడ్డి సామాజిక వర్గానికే మేలు జరుగుతోందని,
మిగతా సామాజిక వర్గాలకు అన్యాయం జరగడం బాధగా ఉందని అన్నారు. తాను కులాలు రెచ్చగొట్టడానికి పార్టీ పెట్టలేదని, చదువుల నేలపై మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. జగన్ పేరు చెప్పడం తనకు ఇష్టం లేదని, జగన్ వైసీపీకి ముఖ్యమంత్రి తప్ప రాష్ట్రానికి కాదు అని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశఆరు.
ఆరోజు అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో పదవుల కోసం పని చేయలేదని, జాతీయ పార్టీలో కలిపినా మాట్లాడలేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రులు, మంత్రులుగా చేసిన వారు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయించారని, లేదంటే ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం ఉండేదని పవన్ అన్నారు.
అంతకుముందు, సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన రైతు కుటుంబానికి మొట్టమొదటి చెక్కును అందించి ఈ కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారు. మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో 170 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతకుముందు పవన్ కడప టూర్ లో అపసృతి జరిగింది. మరి కాసేపట్లో పవన్ సిద్ధవటం చేరుకుంటారని అనగా సిద్ధవటం మండలం మలినేనిపట్నం దగ్గర పవన్ కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానితో ఒకటికి ఢీ కొన్నాయి.