స్టాలిన్ దూసుకుపోతున్న ముఖ్యమంత్రి
జగన్ ఇంకా దూసుకు వెళ్లేందుకు
ఆలోచించి అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి
గత ప్రభుత్వం చేసిన ఏ నిర్ణయాన్ని స్వాగతించని
రీతిలో ఉన్న ముఖ్యమంత్రి జగన్
అయితే మంచి ఉంటే పాటించేందుకు
తాను ఎన్నడూ సిద్ధమేనని
చెప్పే విశాల హృదయం స్టాలిన్ ది
అందుకే పారిశ్రామిక విధానంలో
మన కన్నా చెన్నయ్ టాప్
పారిశ్రామిక విధానం ఎంత గొప్పగా ఉంటే అన్ని గొప్ప గొప్ప నిర్ణయాలు అమలుకు నోచుకుంటాయి. ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క కొత్త పరిశ్రమ ఏర్పాటుకు ఏ విదేశీ సంస్థ కూడా ముందుకు రాలేదు సరికదా వచ్చినవి వెనక్కు వెళ్లిపోవడం విచారకరం. తాము చెప్పిన విధంగా ఆ కంపెనీలు లేవన్న ఒకే ఒక్క సాకుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన లులు కంపెనీ ప్రతినిధులకు చుక్కలు చూపించి పంపేశారు అని, ఇది కేవలం తమ అధినేత చంద్రబాబు పై ఉన్న అక్కసుతోనే చేశారని టీడీపీ నాయకులు వాపోతున్నారు.
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని జగన్ చెబుతున్నారు. కానీ కొన్ని నిర్ణయాలు కారణంగా విశిష్టమయిన రీతిలో కాలానుగుణంగా రాణించే సంస్థలు అన్నీ వెనక్కు వెళ్లిపోతున్నాయి. ఎంతో కష్టపడి ఆ రోజు తాను లులు కంపెనీ పెద్దలను ఒప్పించానని కానీ జగన్ తీరు కారణంగా వాళ్లంతా వెనక్కు వెళ్లిపోయారని నిన్నటి వేళ చంద్రబాబు ఆవేదన చెందారు. సరిగ్గా ఆయన చెప్పిన విధంగా మొన్నటి వేళ (సోమవారం, మార్చి 28 ) చెన్నయ్ ప్రతినిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద స్టాలిన్ తో మూడు వేల 500 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుంది.
ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఏడు వేల ఐదు వందల మందికి ఉపాధి లేకుండా పోయింది.ఆ రోజు విశాఖ కేంద్రంగా లులు కంపెనీ ప్రపంచ స్థాయిలోనే అత్యంత ఆకర్షణీయ రీతిలో ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చింది అని, ఆ రోజు చంద్రబాబు కృషి ఫలితంగానే ఇది సాధ్యం అయిందని, ఇందుకు 13.83 ఎకరాల స్థలాన్ని బీచ్ రోడ్ లో కేటాయించారని ప్రధాన మీడియా వెల్లడిస్తోంది.కానీ జగన్ ప్రభుత్వం ఆ భూ కేటాయింపులు అనూహ్యంగా రద్దు చేసింది. 2019 నవంబర్ లో ఈ నిర్ణయం తీసుకోవడంతో లులు కంపెనీ ప్రతినిధులు పక్క రాష్ట్రానికి తమ ప్రాజెక్టును తరలించేందుకు అక్కడే నిలదొక్కుకునేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఫలితంగా వారికి స్టాలిన్ అండ పుష్కలంగా దొరికింది.దాంతో ఒప్పందాలు కూడా ఇరు వర్గాల మధ్య జరిగిపోయాయి.