ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శల దాడిని తీవ్రస్థాయిలో కొనసాగిస్తున్నారు. ఒకే రోజు రెండు చోట్ల రా..కదలిరా ! సభలు నిర్వహిస్తున్న ఆయన ఆయా సభల్లో వైసీపీ పాలనపైనా, సీఎం జగన్పై విమర్శలతో చెలరేగి పోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా పరిధిలోని ఎస్సీనియోజకవర్గం చింతలపూడిలో నిర్వహించిన రా..కదలిరా! సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ను అర్జునుడు కాదు.. అక్రమార్జుడు! అంటూ భారీ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. వైసీపీ నాయకులు కూడా ఎవ్వరూ ఆనందంగా లేరని తెలిపారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక 12 లక్షల కోట్లరూపాయలను అప్పులు చేశారని.. దీనిలో లక్ష కోట్ల రూపాయలు సీఎం జగన్ ఖాతాల్లోకి వెళ్లాయని చంద్రబాబు ఆరోపించారు. అక్రమార్జనలో ఆయన ముందున్నారు కాబట్టే.. జగన్ అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు అని వ్యాఖ్యానించారు. ప్రజలు ఓ చేత్తో 100 రూపాయలు ఇచ్చి.. రెండో చేత్తో 1000 రూపాయలు దోచేశారని విమర్శించారు. “జగన్ డబ్బులు కాదు.. దెబ్బలు ఇచ్చాడు. ధరలు పెంచాడు. మద్యం నిషేధిస్తానని చెప్పి.. దానిపైనా వ్యాపారం చేశాడు. ఈయన అర్జునుడట. కాదు.. అక్రమార్జునుడు“ అని పదే పదే చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
జగన్ జైలుకు వెళ్తే.. ఆయన తెచ్చిన లక్షల కోట్ల రూపాయల అప్పులను ప్రజలే చెల్లించాలని చంద్రబాబు అన్నారు. .జగన్ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని, అప్పుల పాలైందని నిప్పులు చెరిగారు. ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్స్తోనే ఇంతగా దోచేస్తే.. మరోసారి ఛాన్స్ ఇస్తే.. మీ ఇళ్లు, వాకిళ్లు కూడా దోచేస్తాడని చంద్రబాబు అన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే..యువతను ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. అప్పటి వరకునిరుద్యోగ భృతిని కూడా ఇస్తామని చెప్పారు. చింతలపూడి సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.