మరి కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం తీవ్రస్థాయిలో వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం మళ్లీ గెలుస్తుందని తాను భావించడం లేదని మోడీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జగన్ ను ఎప్పుడూ తమ ప్రత్యర్థిగానే కొట్లాడామని మోడీ క్లారిటీనిచ్చారు.
జగన్ ఎప్పుడూ తమకు మిత్రపక్షం కాదని తేల్చి చెప్పారు. లోక్ సభలో, రాజ్యసభలో అంశాల వారీగా మాత్రమే ఎన్డీఏకు వైసీపీ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు తోడ్పాటు అందించడం తన బాధ్యత అని, ఏపీకి కూడా అదే మాదిరిగా కేంద్రం సహకారం అందించిందని స్పష్టం చేశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కింది స్థాయి నుంచి ఆ ప్రభావం కనిపిస్తోందని మోడీ చెప్పారు.
టిడిపి గతంలో కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉందని, ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపీలు కూడా గెలుస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. వీలైనన్ని పొత్తులు తమ పార్టీ మూల సిద్ధాంతమని, తమ పార్టీకి అహంకారం లేదని స్పష్టం చేశారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను గౌరవించి వారి అవసరాలను గుర్తించాలని చెప్పారు.