టీడీపీ అగ్రనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ నేతలు నానా రకాలుగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా సరే మొక్కవోని దీక్షతో లోకేష్ యువగళాన్ని రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో లోకేష్ పై వైసీపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేసిన ఘటనను టీడీపీ నేతలు అంతా ముక్తకంఠంతో ఖండించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఘటనపై లోకేష్ స్పందించారు. ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నికల ముందు జనానికి విన్నపాలు చేసిన జగన్ ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏం పీకారు అని లోకేష్ ప్రశ్నించారు. ప్యాలెస్ పిల్లికి దమ్ము, ధైర్యం ఉంటే పరదాలు దాటి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. పరదాలు లేకుంటే ప్యాలెస్ పిల్లికి పులుసు కారిపోతుందని, పరదాలు లేకుండా జనంలోకి వెళ్తే పిల్లిపై ఏం పడతాయి అంటూ మైదుకూరు సభలో జనాన్ని లోకేష్ ప్రశ్నించారు.
ఒకరోజు పరదాలు లేకుండా జనంలోకి వస్తే ప్యాలెస్ పిల్లి మీద కోడిగుడ్లు, టమోటాలు, చెత్తాచెదారం పడతాయని, అందుకే పరదాల మధ్య పర్యటించి పారిపోతున్నాడని సెటైర్లు వేశారు. సాఫీగా సహకరిస్తే పాదయాత్ర అని అడ్డుకుంటే దండయాత్ర అని లోకేష్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పొద్దుటూరులో టిడిపి కార్యకర్తలు చూపించింది ట్రైలర్ మాత్రమే అని, తాను చిటికేస్తే గుడ్డు విసిరిన వాళ్ళు కనిపించే వాళ్ళు కాదని లోకేష్ హెచ్చరించారు.
తన తండ్రి చంద్రబాబు అంత ఓపిక తనకు లేదని, అడ్డుకుంటామని ఎవరైనా వస్తే దబిడిదిబిడే అని తన మామ బాలయ్య మార్క్ డైలాగుతో వైసీపీ నేతలకు లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎదురొచ్చి నిలబడితే సత్తా చూపిస్తామని, కడపలో వైసీపీ ప్రభంజనం చూసి ప్యాలెస్ పిల్లికి నిద్ర పట్టడం లేదని చురకలంటించారు. వైసిపిది ఫ్యాన్ గుర్తు కాదని, కోడిగుడ్డు గుర్తని పంచులు వేశారు.
క్లైమోర్ మెన్లకే భయపడని తాము కోడిగుడ్డుకు భయపడతామా అని ప్రశ్నించారు. చీకట్లో గుడ్లు కాదు సైకోస్ దమ్ముంటే నేరుగా వచ్చి నిలబడండి పవర్ చూపిస్తామంటూ లోకేష్ హెచ్చరించారు. పాము తన పిల్లల్ని తానే తిన్న మాదిరిగా జగన్ తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలను మింగేస్తున్నాడని పాము కంటే జగన్ ప్రమాదకారి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.