టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ‘మహాశక్తితో లోకేష్’ అనే కార్యక్రమం ద్వారా స్థానిక మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ సెటైర్లు వేశారు. ‘‘బాయ్ బాయ్ గంజాయి బ్రో జగన్’’ అని జగన్ కు కొత్త పేరు పెట్టారు లోకేష్. అరకు, పాడేరు, ఏజెన్సీ, విశాఖ ప్రాంతాలలో వైసీపీ నేతల ఆధ్వర్యంలోనే గంజాయి పంట సాగు, సరఫరా జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పట్టణాలలో మాత్రమే దొరికే గంజాయి…జగన్ దయ వల్ల మారుమూల గ్రామాలలో సైతం లభిస్తోందని దుయ్యబట్టారు.
తాడేపల్లిలో గంజాయి మత్తులో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిందని, కానీ, జగన్ స్పందించలేదని నిప్పులు చెరిగారు. 2024 మే నెలలో న్యూస్ ఛానల్స్ లైవ్ లో టీడీపీకి మెజారిటీ వచ్చిందన్న వార్త వినగానే ఏపీలో లా అండ్ ఆర్డర్ సెట్ అవుతుందన్నారు. తాను చట్టాన్ని ఉల్లంఘింనినా పోలీసులకు చంద్రబాబే పట్టిస్తారని అన్నారు. తప్పుడోళ్లకు చంద్రబాబు అంటే హడల్ అన్నారు. జడ్జిగా ఉన్న ఒక మహిళను గంజాయి సేవించిన కొందరు వేధించారని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ మహిళా లాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని కొందరు మహిళలు సూచనలిచ్చారు. మానసిక, శారీరక సంక్షేమాన్ని జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మహిళా సైకాలజిస్ట్ అభిప్రాయపడ్డారు. దాంతో, పిల్లలు డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, బాడీ షేమింగ్, బాడీ డిస్మార్ఫియాలకు గురవుతున్నారని చెప్పారు. దీంతో, ఆ మహిళలకు లోకేష్ భరోసానిచ్చారు. టీడీపీ ఎల్లపుడూ మహిళలకు అండగా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామని చెప్పారు. తాను కూడా బాడీ షేమింగ్ బాధితుడినే అని లోకేష్ అన్నారు. గతంలో, తన శరీరంపై కూడా హేళన చేసే వారని, శాసనసభలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో బాడీ షేమింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.