ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పెరిగిపోయిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మైనింగ్, ఇసుక…ఇలా ఏ మాత్రం చాన్స్ దొరికినా…వందల కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ రెడ్డి జాంబిరెడ్డిలా ప్రవర్తిస్తున్నారని, వైసీపీ నేతలు, కార్యకర్తలను జగన్ కరుస్తున్నారని లోకేశ్ షాకింగ్ కామెంట్లు చేశారు. అందుకే వారు అలా ప్రవర్తిస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. 2024లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, జగన్ నాన్న, తాతలే టీడీపీని ఏమీ చేయలేకపోయారని లోకేశ్ అన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే వైసీపీ నేతల తాటతీస్తామని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
అనపర్తిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన లోకేశ్…స్థానిక ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. అనపర్తిలో అభివృద్ది నిల్, అవినీతి ఫుల్ అని, అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే మంచి నటుడు, అవినీతిపరుడు అని ఎద్దేవా చేశారు. కాపవరంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలతో 400 కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు వైసీపీ నేతలు యత్నించారని, దానిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అడ్డుకున్నారని అన్నారు.
దీంతో, నల్లమిల్లిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే వైసీపీ నేతల తాటతీస్తామని లోకేశ్ హెచ్చరించారు. డీజీపీ పోలీస్ డ్రెస్ తీసేసి వైసీపీ కండువా వేసుకుంటే మంచిదని షాకింగ్ కామెంట్లు చేశారు.