ఏపీ సీఎం జగన్ తాజాగా విశాఖలోని సింగవలసలో నిర్వహించిన సిద్దం సభలో తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్న విషయం తెలిసిందే. “కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోవడానికి నేను అభిమన్యుడిని కాదు.. ఓటమి ఎరుగని అర్జునుడిని. మనం పాండవులం.. వాళ్లు కౌరవులు“ అంటూ.. ప్రతిపక్షాలపై విమ ర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ అర్జునుడి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
“సీఎం జగన్ తనని తాను అర్జునుడుగా పోల్చుకున్నాడు. నిజానికి జగన్.. అర్జునుడో, అభిమన్యుడో కాదు భస్మాసురుడు. ఈ రాష్ట్రాన్ని తగలబెట్టేందుకు వచ్చిన భస్మాసురుడు“ అని చంద్రబాబు అన్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్ట పోయిందన్నారు. తుగ్లక్ ఆలోచనలు. సైకో పాలనతో ఏపీలో జగన్ విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.
“సిద్దం సభ పెట్టారు. కానీ, ఆయన టిక్కెట్లు ఇచ్చిన వారు కూడా ఉండలేం మహాప్రబో అని దండం పెట్టి పోరిపోతున్నారు“ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. “జగన్ బిడ్డ కాదు. క్యాన్సర్ గడ్డ. తొలగించాలా? వద్దా?“ అని ప్రజలను ప్రజలను ప్రశ్నించారు. ఫ్యానుకి ఉండే మూడు రెక్కలని ప్రజలు వచ్చే ఎన్నికల్లో పీకి పాతరేస్తారని వ్యాఖ్యానించారు. రివర్స్ పాలనలో రివర్స్ గిఫ్టు ఇస్తారని చెప్పారు. జగన్ చేసిన తప్పుడు పనులు చెప్పారని.. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలను బయటకు తోసేశారని అన్నారు.
రండి.. నేనున్నా!
ఈ సందర్భంగా వైసీపీలో ఎవరైనా అసంతృప్తితో ఉన్నట్టయితే.. వెంటనే తన వద్దకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. “వైసీపీ వారికి రా… కదలిరా… అని పిలుపునిస్తున్నా“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటామని.. పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. జగన్ పుట్టక ముందు నుంచి తాను రాజకీయాలు చేస్తున్నానని.. కావాలంటే కలలో రాజశేఖర్ రెడ్డిని అడుగు జగన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.