టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన విజయవంతంగా ముగిసింది. చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఆద్యంతం జన సందోహంగా సాగింది. కుప్పం పర్యటనలో సీఎం జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కుప్పంలోని పలు గ్రామాల్లో రచ్చబండ నిర్వహించిన చంద్రబాబు, జగన్ పై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. జనం తిరగబడితే జగన్ బయట తిరగలేరని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఉత్తర కొరియాలో నియంత కిమ్ జాంగ్ ఉన్న ఉన్నట్లుగానే ఏపీకి జగన్ ఉన్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మనపై దాడి చేసి మనపైనే జగన్ కేసులు పెడుతున్నాడని మండపడ్డారు. అన్న క్యాంటీన్లలో పేదలకు కడుపునిండా పట్టెడన్నం పెడుతుంటే దాడి చేయడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక, కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా పనులు ఆగిపోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
హంద్రీనీవా కాలు పనులను టీడీపీ హయాంలోనే చాలావరకు పూర్తి చేశామని, మిగిలి ఉన్న కొద్ది పని పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. హంద్రీ నీవా ద్వారా కుప్పానికి నీరు వస్తే టీడీపీకి మంచి పేరు వస్తుందని జగన్ ఆ పనుల్లో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. హంద్రీ నీవా పనులపై తాను అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పగలడా అని నిలదీశారు.
ఇక, టీడీపీ నేతలను, కార్యకర్తలను అనవసరంగా ఇబ్బంది పెడుతున్న పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేస్తానని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు రచ్చబండ నిర్వహించిన ప్రతి చోటా అనూహ్యం స్పందన వచ్చింది. ఎక్కడికి అక్కడ ప్రజా సమస్యలను చంద్రబాబు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని చంద్రబాబు ప్రజలకు భరోసా కల్పించారు.