ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎన్నికల బరిలో మూడో ప్రత్యామ్నాయంగా పోటీ చేసేందుకు జనసేన కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.. ఈ నేపథ్యంలోనే తమ రాజకీయ వ్యూహాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పరిస్థితులకు అనుగుణంగా పార్టీ వ్యూహాలు మారుతుంటాయని, తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ప్రకటించిన వ్యూహాలను ఆ తర్వాత ఆయన మార్చుకున్నారని పవన్ అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలను ఆయన మర్చిపోయారని పవన్ ఎద్దేవా చేశారు. ఇక, జనసేన పార్టీలోనూ వెన్నుపోటు నేతలున్నారని, తన పక్కనే కూర్చుని తనను వెనక్కి లాగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బయట శత్రువులతో పోరాడవచ్చని, కానీ పార్టీలో నమ్మకద్రోహులతో పోరాటం చాలా కష్టమని అన్నారు. మనస్పూర్తిగా ఇష్టం ఉంటేనే జనసేనలో ఉండాలని, ఇష్టం లేని వాళ్ళు వెళ్లిపోవాలని పవన్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీని, తనను దెబ్బకొట్టే బదులు వేరే పార్టీలోకి వెళ్లి తనను తిట్టినా పర్వాలేదని పవన్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఒకవేళ డబ్బులు తీసుకొని ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లుగా తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనే నినాదంతో ముందుకు వెళదామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అభివృద్ధి లేకుండా అప్పులు మాత్రమే చేసి ప్రజలపై వాటిని రుద్దుతున్నారని, ప్రభుత్వం చేస్తున్న అప్పులు భవిష్యత్తులో ప్రజలు తీర్చలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని పవన్ మండిపడ్డారు.