ఇంత పెద్ద మాట ఎవరని ఉంటారో ఊహించగలరా? టీడీపీ అధినేత చంద్రబాబు అయితే అనలేదు. ఇక, వైసీపీపై కారాలు మిరియాలు నూరే.. జనసేన కూడా కాదు. మరోవైపు.. వైసీపీని, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్న షర్మిల కూడా కాదు. మరి ఎవరని ఉంటారు.? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కదా! ఇక్కడికే వస్తే.. ఈ మాట అన్నది.. పొలిటికల్ కమెడియన్.. కేఏ పాల్. సీఎం జగన్ పై ఆయన విరుచుకుపడ్డారు.
“130 దేశాల అధ్యక్షులు, ప్రధానులు నా అప్పాయింట్మెంట్ కోసం వేచి ఉంటారు. కానీ, నేను ఈ జగన్ కోసం ఎదురు చూశాను. వచ్చే ఎన్నికలకు సంబందించి సంచలన విషయాలు నాదగ్గర ఉన్నాయి. వాటిని చెప్పాలని వస్తే.. కనీసం నా మొహం కూడా చూడరా వేస్ట్ ఫెలో!“ అని వ్యాఖ్యానించారు. ఇక, ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్‌పై ప్రశంసలు కురిపించారు. రేవంత్ గొప్ప నాయకుడు అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి మారుతోందని చెప్పారు. వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సైతం మారబోతోందని తెలిపారు.
ప్రపంచంలోని బిలియనీర్స్ ను కలిసి హైదరాబాద్‌కు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇక, బీఆర్ ఎస్ అధినేత, కేసీఆర్‌పైనా చురకలు అంటించారు. కేసీఆర్‌కు, రేవంత్‌కు పోలిక లేదన్నారు. కేసీఆర్ డిక్టేటర్ లా వ్యవహరిస్తే.. రేవంత్ మాత్రం ప్రజల మనిషిగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేఏ పాల్ అసెంబ్లీకి చేరుకున్నారు. అనుమతి లేదంటూ ఎంట్రీ వద్ద భద్రత సిబ్బంది వీరిని ఆపేశారు. కొంత సమయం తర్వాత అనుమతి రావడంతో సెక్రెటరీ ఛాంబర్ లో కూర్చున్నారు. ఈ సందర్బంగా మీడియాతో పాల్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.