ఏపీ సీఎం జగన్ పై తరచుగా విమర్శలు గుప్పించే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్.. తాజాగా సటైర్లతో విరుచుకుపడ్డారు. జగన్ను ఆయన బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎద్దేవా చేశారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే బద్ధకమని.. ప్రజలను కలుసుకోవాలంటే.. బద్ధకం+భయం రెండూ ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆర్ ఆర్ ఆర్.. ఇక, ఇప్పుడు సీఎం హోదాలో పోలవరం పర్యటించిన జగన్కు ఇదే అధికారిక చివరి కార్యక్రమం అవుతుందన్నా రు. ఇక, ఆయన పోలవరాన్ని ప్రతిపక్షనేత హోదాలోనే భవిష్యత్తులో సందర్శించాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు.
“జగన్ ఇంటి నుంచి బయటకు రాడు. అలా వస్తే ఎన్నో చెట్లు నరికి వేస్తారు, జనాలకు ఉపాధి పోతుంది. తాడేపల్లి ప్యాలెస్ వది లి జగన్ పోలవరంలో ఉన్ననేతలను రాత్రి సమయంలో కలుస్తున్నారు. ఆయనకు చీకటి రాజకీయాలు చేయడం అంటే ఇష్టం“ అని ఎద్దేవా చేశారు. మాములుగా జగన్ ఎవరిని కలవరన్న రఘురామ.. ఏదైనా ప్యాకేజీ వంటివి ఉంటేనే ఆయన కలుస్తారని వ్యాఖ్యానించారు. “త్వరలోనే మా పార్టీ(వైసీపీ)లో తిరుగుబాటు జరుగుతుంది. ఇది పక్కా“ అని రఘురామ బాంబు పేల్చారు.
ఎమ్మెల్యేల తిరుగుబాటును ముందుగానే ఊహించిన జగన్ చీకటి రాజకీయాలకు తెరదీశారని రఘురామ అన్నారు. అందుకే ఇప్పుడు పోలవరం పేరుతో అక్కడ రాత్రి వేళ నేతలను కలుస్తున్నారని చెప్పారు. విపత్తు వచ్చినప్పుడు జగన్ వెళ్తే అధికారుల కు ఇబ్బంది ఉంటుందని, అక్కడకు వెళ్లారని ఎద్దేవా చేశారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను, పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరంలో జరిగిన సమావేశంలో జగన్ అంతా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని సటైర్ వేశారు. నిజమైన వరద బాధితులను వైసీపీ నేతలు మాట్లాడనివ్వలేదని, అదికారులు కూడా వారిని కట్టడి చేశారని మండిపడ్డారు.